ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విధించిన స్టే పై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.
అయితే సుప్రీం కోర్టు ఈ విషయాన్ని ఇప్పుడు విచారించడానికి నిరాకరించింది. హై కోర్టు తీర్పు తరువాతే తమ దగ్గరకు రావాలని చెప్పింది. ఇదంతా తెలిసిన విషయమే. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే సుప్రీం కోర్టు ఆవరణలో నిర్మాత ఆయన లాయర్ ఉన్న ఫోటో ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ లాయర్ ఎవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్ సెల్ లో పని చేసే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అన్ని కేసులు ఆయనే వాదిస్తూ ఉంటారు.
దీనిబట్టి ఈ సినిమాకు ఆ పార్టీకి గల లింకు స్పష్టం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన అనేక కేసులలో ఆయనే న్యాయవాది. దీనిబట్టి ఏ ఉద్దేశంతో ఆ సినిమా తీశారు అనేది అర్ధం అవుతుంది. జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఈ సినిమా విడుదలను చంద్రబాబు ఆపుతున్నారని పదే పదే ప్రశ్నించడం మనం చూశాం. వీటన్నిటి బట్టి ఇది పూర్తిగా చరిత్రను వక్రీకరించి వైకాపాకు అనుకూలంగా తీసిన సినిమా అని టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఉంది.



