ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫలితాల అనంతరం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. దీనితో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అలుపెరుగని పోరాటం చేసిన అభిమానులు ఆయన ట్వీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆయన ఈరోజు ఎన్నికల్లో విజయం, ప్రమాణస్వీకారంపై ట్విటర్ వేదికగా స్పందించి స్పందించారు.
ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని, సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. “అపూర్వ విజయం అందించిన ప్రతి ఒక్కరికీ, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. మీ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తాను. ఈ దేశం గర్వంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా సుపరిపాలన అందిస్తాను” అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లు గెలుచుకుంది.
తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకుంది. బొటాబొటిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా నిలబెట్టుకుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. మరోవైపు జగన్ తన కేబినెట్ కూర్పు పై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ విస్తరణ జూన్ 7న జరగబోతుందని సమాచారం. 11న అసెంబ్లీ తొలిసారిగా సమావేశం కాబోతుంది. కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. అదే నెల చివరి వారంలో కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది.



