YS Jagan Mohan Reddy Political Yatra

కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగానే 2024 వైసీపీ పతనానికి కూడా అంతే మోతాదులో తప్పిదాలు ఉన్నాయి. అలాగే 2019 వైసీపీ విజయానికి జగన్ పాదయాత్రలు, ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు, కుటుంబ సభ్యుల సహకారం, అమాత్యుల పరోక్ష మద్దతు ఇలా అనేక అస్త్రాలు వైసీపీ విజయానికి మార్గాలు చూపాయి.

ఈ అస్త్రాలతో పాటు ప్రత్యర్థి పార్టీల మధ్య ఏర్పడిన చీలిక, ప్రజల అమాయకత్వం కూడా తోడవడంతో జగన్ వేసిన రాజకీయ పాచికలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలనిచ్చాయి. అయితే అప్పుడు జగన్ చేతిలో ఉన్న అస్త్రాలలో ఇప్పుడు కొన్ని చేజారిపోగా మరికొన్ని నిరుపయోగంగా మిగిలాయి.

Also Read – కేటీఆర్‌.. ఈ సంక్రాంతి పండుగ ఇంట్లోనే…

ఇందులో వైసీపీ విజయానికి, జగన్ పట్టాభిషేకానికి ముఖ్య పాత్ర పోషించింది జగన్ పాదయాత్ర. నా అవ్వాతాతలు, నా అక్కచెల్లెమ్మలు అంటూ పాదయాత్రలో జగన్ చూపిన కపట ప్రేమకు కట్టు బానిసలుగా మారిపోయారు ఏపీ ఓటర్లు. దాని ఫలితమే గత ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని పంటి బిగువున బిగబెట్టుకున్నారు.

అయితే నాడు అధికారం కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ ఆ అధికారం చేతికందగానే ప్యాలస్ ల మధ్య విమాన యాత్రలు చేసారు. 2011 లో 1 తో మొదలైన వైసీపీ ప్రయాణం 2019 కి 151 గా ఎగిసి ప్రస్తుతం 11 కి పడింది. వైసీపీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షములో ఉంటే ప్రజల మధ్య అధికారంలో ఉంటే ప్యాలస్ లోపల అన్నటుగా సాగిన జగన్ విధానం నేటికీ ప్రజలు గుర్తించారు.

Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!

2025 సంక్రాంతి తరువాత తిరిగి యాత్రల పేరుతో ప్రజా క్షేత్రంలోకి వస్తా, పార్టీని బలపరుస్తా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ కు ఈసారి యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా సాగలేవు. అప్పుడు మాదిరి జగన్ ముద్దులు పెట్టుకుంటూ తిరిగినా ఆయన ప్రభుత్వంలో గుద్దిన గుద్దులే గుర్తుకొస్తాయి. అలాగే నా అక్కచెల్లమ్మలు, నా అవ్వాతాతయ్యలు అంటూ ఓదార్పు పలుకులు ఈసారికి చెల్లవు.

సొంత తల్లిని, చెల్లినే కోర్టుకు ఈడ్చిన వాడిని నమ్మే పరిస్థితులు లేవు. నాకు ఇక్కడే సొంత ఇల్లు ఉంది నేను మీ వాడినే నన్ను నమ్మండి అంటూ చెప్పే కళ్ళబుల్లి కబుర్లకు రాజధాని మార్పుతో కాలం చెల్లింది. మీ కష్టానికి కాపు కాస్త, మీకు అండగా ఉంటా అంటూ చెప్పే కహానీలు రెడ్డి గారి పేరు మార్పుతో మాయమయ్యాయి.

Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?

ఇక జగన్ గారి ఐ ప్యాక్ మాయలు, వైసీపీ సోషల్ మీడియా దుర్మార్గాలు, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ఇలా ఒక్కొక్కటి ప్రజల ముందుకు వచ్చాయి. అలాగే రాజకీయాలను వ్యక్తిగత దూషణలతో భ్రష్టు పట్టించిన వైసీపీ కీచకులు శ్రీరెడ్డి, పోసాని, బోరుగడ్డ, ఆర్జీవీ ఒక్కొకరుగా తమ ముసుగు తొలగించారు. నాడు వీరందరిని పోత్సహించిన పాపానికి జగన్ నేడు ప్రజలకు జవాబు చెప్పాలి.

అలాగే ప్రతిపక్షములో ఉన్నన్నాళ్లు ప్రజల మధ్యన నడిచిన జగన్ అధికారం రాగానే పరదాల చాటున ఎందుకు దాక్కున్నారో సంజాయిషీ ఇవ్వగలరా.? ఇక గత ఐదేళ్లు పవన్ వ్యక్తిగత జీవితం మీద రాజకీయం నడిపిన వైసీపీ గడిచిన ఐదు నెలలుగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన వైసీపీ నేతల వ్యక్తిగత వివాదాల గురించి చెప్పగలరా.? గత ఐదేళ్లుగా నొక్కిన బటన్ల గురించి ప్రచారం చేసుకున్న జగన్ కు ఇపుడు చేసిన అప్పుల గురించి చెప్పగలరా.?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకు రాని జగన్ గత ఐదేళ్లుగా వాహనదారులు పడ్డ ఇబ్బందులకు బదులివ్వాలి. నాటి పాలనకు నేటి ప్రభుత్వానికి మధ్య ఉన్న అభివృద్ధి మంత్రాన్ని గురించి తెలుసుకుని దానికి తగ్గట్టు నడుచుకోగలగాలి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నుంచి కాకినాడ బియ్యం అక్రమ రవాణా వరకు ఒక్కో వైసీపీ అవినీతి చిట్టా బయటకొచ్చింది. దీనితో వైసీపీ పట్ల ప్రజలలో ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా కనుమరుగయ్యింది.




దీని బట్టి చూస్తే ఈసారి జగన్ రాజకీయ యాత్రలు నల్లేరు మీద నడక మాదిరి సాఫీగా ఉండబోదని, ఆయన ప్రజల ముందుకు వెళితే పరిస్థితులు వైసీపీ ఉహించినంతా అందంగా కనిపించవనేది సుస్పష్టం. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలే నిత్యం ప్రజా దర్బార్ లు నిర్వహిస్తూ ఎక్కడిక్కడ స్థానిక సమస్యల మీద స్పందిస్తూ నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.