‘ప్రత్యేక హోదా’ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇస్తామని చెప్పి ఎందుకు వెనక్కి తగ్గారో ప్రజలకు చెప్పమంటున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేతతో కలిసి ముందుకెళ్తారన్న టాక్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. స్వయంగా పవన్ కళ్యాణ్ లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ ను కలుస్తారని, ఆ పైన ప్రత్యేక హోదాపై పోరాటం చేసేందుకు ఇద్దరు చేతులు కలుపుతారని ఇటీవల మీడియా వర్గాలలో ప్రధానంగా వార్తలు ప్రసారం కావడంతో, ఒక్కసారిగా పవన్ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా… తనకు ఏ వ్యక్తితోనూ రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా గానీ విభేదాలు లేవంటూ పవన్ ప్రకటించడంతో, జగన్ కు హస్తమిచ్చేందుకు పవర్ స్టార్ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది. దీంతో తాజాగా యుఎస్ లో మీడియాను పలకరించిన పవన్ కు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. ‘స్పెషల్ స్టేటస్’ విషయంపై వైసీపీ అధినేత జగన్ తో కలిసి పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? అన్న ప్రశ్నకు పవన్ ఓ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
‘అలాంటి ప్రతిపాదనలేవీ తన వద్దకు రాలేదని’ చెప్పడంతో జగన్ తో కలిసే విషయంపై ఓ స్పష్టత వచ్చేసినట్లే. ఈ సమాధానంతో తను నేరుగా లోటస్ పాండ్ కు వెళ్ళే ఉద్దేశం లేదని కూడా పవన్ చెప్పకనే చెప్పారు. ఒకవేళ జనసేనతో కలిసి పోరాటం చేయాలన్న ఉద్దేశం వైసీపీకి ఉంటే, ముందుగా వారే పవన్ కు ప్రతిపాదనలు పంపాలని కూడా పరోక్షంగా వెల్లడించినట్లయ్యింది. దీంతో ఇప్పుడు బాల్ వైసీపీ కోర్టులో పడినట్లయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించినపుడు మాత్రం పవన్ ను తన మీడియాలో హైలైట్ గా చూపించే జగన్, ఒక మెట్టు తగ్గి పవర్ స్టార్ వద్దకు వస్తారా? అనేది వేచిచూడాలి.


