ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా కాలేజీలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించారు. 47 రోజులపాటు సాగే ఈ ఆటల పోటీ దేశ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని జగన్ చెప్పారు. ఆటల వలన షుగర్, బీపీ అదుపులో ఉంటాయని చెప్పారు.
సిఎం జగన్ స్వయంగా మంత్రి రోజా చెయ్యి పట్టుకొని బ్యాటింగ్ ఎలా చేయారో నేర్పించారు. ఆ తర్వాత ఆమె జగన్ చేతికి బ్యాట్ ఇచ్చి ఆయన చేత బ్యాటింగ్ చేయించడం ఈ రోజు కార్యక్రమంలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, అధికారులు, భద్రతా సిబ్బంది అందరూ ఫీల్డింగ్ చేస్తూ ఏపీ ప్రజలకు ఓ అరుదైన గేమ్ చూపించారు.
‘ఆడుదాం ఆంద్రా’ అంటూ జగన్ ఇప్పుడే బ్యాట్ ఎందుకు పట్టుకొన్నారో కానీ ఆ పేరు పెట్టకపోయినా 2019 నుంచి ఆయన ఆడుతూనే ఉన్నారు.
· ఫస్ట్ రన్‌లో ఆయన కొట్టిన దెబ్బకే ఉండవల్లిలో ప్రజావేదిక కూలిపోయింది.
· ఆ తర్వాత కొట్టిన దెబ్బకి బంతి మూడు ముక్కలై ఒకటి అమరావతిలో, మరొకటి కర్నూలులో, మరొకటి విశాఖలో పడింది. ఆ తర్వాత కర్నూలు, అమరావతిలో పడ్డ ఆ బంతి ముక్కలు ఎంత వెతికినా ఎవరికీ దొరకలేదు.
· విశాఖలో పడిన బంతి ధాటికి కొండంత ఋషికొండ మట్టిదిబ్బగా మారిపోయింది. ఇదే ఊపులో జగన్ అమరావతి రైతులతో కూడా ఓ ఆట ఆడుకోగా నాలుగేళ్ళుగా వారు పాపం ఫీల్డింగ్ చేస్తూనే ఉండిపోయారు.
· ఇక నాలుగున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం ఆడిన ఆటలతో వైసీపిల బీపీ, షుగర్‌లు తగ్గాయో లేదో తెలీదు కానీ పన్నులు, ఛార్జీలు పెంచినందుకు జనాలకు, పోలీసుల కేసుల కారణంగా టిడిపి నేతలకు, మార్గదర్శి కేసులతో రామోజీరావుకి బీపీ, షుగర్లు బాగానే పెరిగాయి.
· రెండేళ్ళపాటు తన మంత్రులతోనే ఆడుకొన్న జగన్ సరిగ్గా ఆడనివారిని మార్చేశారు.
· ఆ తర్వాత “నేను బటన్ నొక్కి 175 రన్స్ కొడతాను,” మీరందరూ గడప గడపకి పరుగులు తీస్తుండమని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలనీ పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. తీరా చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే, మిమ్మల్ని నమ్ముకొంటే నేను రన్ అవుట్ అయ్యేలా ఉన్నాను… కనుక మీ కంటే బాగా రన్స్ చేయగలిగే కొత్త టీమ్ ఏర్పాటు చేసుకొంటానంటూ వైసీపి ఎమ్మెల్యేలతో ఆడుకొంటూనే ఉన్నారు.
· సీనియర్ బ్యాట్స్ మ్యాన్ చంద్రబాబు నాయుడుతో జగన్ ఏ రేంజ్‌లో ఆడుకొన్నారో అందరూ చూశారు. పవన్ కళ్యాణ్‌నైతే పాపం నేటికీ విడిచిపెట్టడమే లేదు. చివరికి పవన్ కళ్యాణ్ దగ్గినా తుమ్మినా చంద్రబాబు నాయుడు కోసమే అని వాదిస్తున్నారు.
· ఇక మట్టి బ్యాచ్, ఇసుక బ్యాచ్, కొండలు-గుట్టల బ్యాచ్, భూకబ్జాల బ్యాచ్, మద్యం బ్యాచ్, బూతుల బ్యాచ్, గంట-అరగంట బ్యాచ్… వంటివి రకరకాల బ్యాచ్‌లున్నాయి. అవన్నీ కూడా 2019 నుంచి సమాంతరంగా దేని ఆటలు అవి ఆడుకొంటూనే ఉన్నాయి.
· ఇక సిపిఎస్ రద్దు పేరుతో ప్రభుత్వోద్యోగులతో, జీతాలతో ఉపాధ్యాయులతో, విద్యార్దులతో బైజూస్ ఆన్‌లైన్ స్కూలు గేమ్స్ ఇంకా సాగుతూనే ఉన్నాయి.
· సంక్షేమ పధకాలతో మొదలుపెట్టిన గేమ్స్ ఓ పక్క సాగుతుండగానే, ఓటర్స్ లిస్టులో అసమదీయులు చేర్చి, తసమదీయులను తొలగించే గేమ్స్ కూడా సాగుతూనే ఉన్నాయి.
· తాజాగా అంగన్వాడీ కార్యకర్తలతో’, వాలంటీర్లుతో కూడా ఆట మొదలుపెట్టారు.
ఆడుదాం ఆంద్రా 47 రోజులతో ముగుస్తాయి. వైసీపి అధినేత జగన్ 5 ఏళ్ళపాటు నిర్విరామంగా ఇన్ని రకాల గేమ్స్ ఆడినా ఏమాత్రం అలిసిపోకుండా, 175 రన్స్ కొట్టి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో గెలిచి, సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాలని ఉత్సాహపడుతున్నారు. కానీ ఎల్లో వారియర్స్ ఈసారి మేమే టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెడతామని చెప్పుకొంటున్నారు!




