“ఓట్లు చీల్చే రాజకీయాలా”..? షర్మిల రీఎంట్రీలో ‘మరో కోణం’.!

YS Sharmila

అన్న వదిలిన బాణంగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టిన వైస్ షర్మిల ఏపీలో తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవడంతో అన్న వదిలించుకున్న బాణంలా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయారు. అక్కడ కూడా బాణం గురితప్పడంతో ఇక చేసేదేమి లేక తిరిగి స్వస్థలానికి చేరుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తన YSRTP ని ఢిల్లీలో సమాధి చేసి ఏపీలో సమాధైనా కాంగ్రెస్ పార్టీని తన బాణంతో తవ్వి తీసే కార్యక్రమానికి షర్మిల శ్రీకారం చుట్టారు. షర్మిల ఎంట్రీ తో ఏపీ కాంగ్రెస్ యాక్టీవ్ అయ్యింది. వైసీపీ లో వైస్సార్ కుటుంబానికి బద్దుడిగా ఉండి జగన్ నిర్ణయాలను వ్యతిరేకించే వైసీపీ నాయకులకు షర్మిల ఒక దివ్యాస్త్రంగా కనపడవచ్చు.

ADVERTISEMENT

దానితో ఆర్కే లాంటి వైస్సార్ అభిమానులు ఏపీ కాంగ్రెస్ లో జగన్ కాదని షర్మిల వెంట నడవడానికి సిద్దపడుతున్నారు. అయితే దీని వలన వైసీపీ పార్టీకి ఒక రకంగా నష్టం మరో రకంగా లాభం చేకూరే అవకాశం లేకపోలేదు. “వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానూ ఇచ్చిన స్టేట్ మెంట్ కి కట్టుబడి టీడీపీ పార్టీ తో పొత్తు కుదుర్చుకున్నారు.

దీని వలన వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే టీడీపీ కి లేకుంటే జనసేనకు దక్కే అవకాశం ఉండేది. ఏపీ లో కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు తమ ఉనికిని కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉండేవి కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీల మధ్యనే ఉండేది. దీనితో టీడీపీ – జనసేన పార్టీలకు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమయ్యేది. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ యాక్టీవ్ అవ్వడం, ఏ పార్టీలో సీటు దొరకని అభ్యర్థులకు, ఆశావాదులకు కాంగ్రెస్ మరో ప్రత్యామ్నాయం కాబోతుంది.

దీనితో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అందిపుచ్చుకోవడానికి తన ‘హస్తాన్ని’ రెడీగా ఉంచుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే టీడీపీ – జనసేన కూటమికి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. జగన్ కావాలనే షర్మిలను కాంగ్రెస్ పార్టీకి చేరువ చేసి టీడీపీ – జనసేన కు వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ కూడా పంచుకునేలా చేసి “ఓటు చీల్చే రాజకీయాలకు” జగన్ పావులు కదుపుతున్నారనే కోణంలో కూడా విశ్లేషణలు వినపడుతున్నాయి.

2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇదే వ్యూహాన్ని అమలు చేసారు. “కొందరిని టీవీ డిబేట్లకు పంపారు, మరి కొందరిని విశ్లేషణలకు పంపారు”. “ఆయన మాత్రం ఫ్యాన్ తిప్పుకుంటూ పాదయాత్రలు చేసుకున్నారు”. కత్తి మహేష్, శ్రీ రెడ్డి వంటి వారితో పవన్ పై కొన్ని నెలల పాటు జరిపిన టీవీ డిబేట్లతో టీడీపీ, జనసేనల దృష్టి మరల్చగలిగారు. అలాగే రాజకీయ మేధావిని అనుకునే ఉండవల్లి వంటి వారితో టీడీపీ ప్రభుత్వం పై విశ్లేషణలు ఇప్పించి ప్రజల దృష్టిని ఏమార్చగలిగారు.

జగన్ మాత్రం రోడ్ల మీద బుగ్గలు నిమురుతూ, ముద్దులు పెట్టుకుంటూ, నోటికొచ్చిన హామిలిచ్చుకుంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ టీడీపీ – జనసేనలకు జగన్ వ్యూహంలో చిక్కుకున్నాం అనేది అర్థం కాలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, షర్మిల అనుకుంటూ టీడీపీ – జనసేనల దృష్టి షర్మిల వైపు వచ్చేలా జగన్ మరో వ్యూహాన్ని రెడీ చేశారేమో అంటూ ఇరు పార్టీల నేతలు షర్మిల రీఎంట్రీ ని మరో కోణంలో చూడాల్సి ఉంటుంది.

జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఆర్కే రాజీనామా, వైస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండే ఉండవల్లి వంటి వారు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో టీడీపీ – జనసేన కూటమిని దెబ్బ కొట్టడానికి జగన్ ఎంచుకున్న “ఫార్ములా 2 .0 “ఇదే కావచ్చు అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈసారైనా రెండు పార్టీల అధినేతలు చేతులు కాలేదాకా వేచి చూడకుండా వెంటనే ఆకులు పట్టుకుంటారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories