ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంటు విలువ ఏమిటో ఒక్క చంద్రబాబు నాయుడుకే తెలుసు. వరుసగా తొమ్మిదేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని తలచి, ఒక ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంటు, రైతులది కీలక పాత్ర అన్న విషయం జగమెరిగిన సత్యమే. ఈ విషయాన్ని గమనించే, ఈ సారి కాస్త చూసిచూడనట్లుగా వారిని వదిలేస్తున్న వైనం కనపడుతోంది.
ఇదిలా ఉంటే, మరో వైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంటుపై నిప్పులు కక్కుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా… అక్కడ ఉన్న ఉద్యోగులపై ఫైర్ అవుతూ, కాబోయే ముఖ్యమంత్రిని, అప్పుడు మీ అంతు చూస్తానంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అలాగే పోలీస్ వారిని కూడా వదిలిపెట్టడం లేదు. మొన్నటికి మొన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో చేసిన రాద్ధాంతం అందరూ టీవీలలో ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే తాజాగా కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలోనూ ఇదే రకమైన తీరును ప్రదర్శించారు.
అయితే ఈ సారి ఏకంగా ఐఏఎస్ లను కూడా టార్గెట్ చేయడం విశేషం. కృష్ణాజిల్లా కలెక్టర్ ను సెంట్రల్ జైలుకు పంపిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అలాగే ఐఏఎస్ లందరూ కూడా అవినీతి పరులేనని సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మొత్తం గవర్నమెంట్ అధికారుల నుండి పోలీసు వర్గాల వరకు ఎవరినీ కదిలించినా జగన్ పై మండిపడుతున్నారు. ఐఏఎస్ లైతే ఏకంగా జగన్ పై ఫిర్యాదులు చేసే వరకు కార్యాచరణ చేస్తుండడం విశేషం.
వీరంతా కూడా తనకు ఓట్లు వేస్తేనే తానూ ముఖ్యమంత్రిని కాగలనన్న విషయాన్ని జగన్ విస్మరిస్తున్నట్లున్నారు. ఇదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులలో భాగంగా అప్పట్లో అధికారంలో ఉన్న ఐఏఎస్ లు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. ఇవన్నీ కనీసం ఆలోచించుకుని కూడా జగన్ మాట్లాడడం లేదన్న విషయం రాజకీయ పరిపక్వత గల వారికి ఇట్టే అర్ధమవుతుంది. ఓ పక్కన తానూ వారంలో ఒకరోజు ఖచ్చితంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ కలెక్టర్లను సెంట్రల్ జైలుకు పంపిస్తానని చెప్పడం ఎంతవరకు సహేతుకమో జగన్ కే తెలియాలి.
బహుశా జైలు ఏమైనా తన లోటస్ పాండ్ అనుకుంటున్నారేమో… అని సోషల్ మీడియాలో ఈ సందర్భంగా జగన్ పై పడుతున్న కౌంటర్లు, సెటైర్లకు కొదవలేదు. అయినా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటోంది… ప్రభుత్వ ఉద్యోగులపై, పోలీసు అధికారులపై, కలెక్టర్లు తదితరులపై రివేంజ్ తీర్చుకోవడానికా? లేక ప్రజలకు కాస్త మంచి చేయడానికా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సినిమాలలో అయితే ఇలాంటి డైలాగ్ లకు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారేమో గానీ నిజజీవితంలో మాత్రం కాదన్నది జగన్ గుర్తిస్తే మంచిదన్న సూచనలు నలుదిక్కుల నుండి వస్తున్నాయి.


