2019 నుండి ఇప్పటివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఘనమైన చరిత్రను మూటకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఎట్టి పరిస్థితులలో విశాఖను రాజధానిగా చేయాలని వివిధ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ప్రయత్నాల ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!?
ముఖ్యంగా ఈ ఏడాదిలో విజయదశమి నుండి విశాఖను కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగిస్తామని ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డే వివిధ సందర్భాలలో తేల్చిచెప్పారు. దసరా పర్వదినం అయితే మరికొద్ది రోజుల్లో సిద్ధంగా ఉంది గానీ, జగన్ చెప్పిన మాటేమిటి అంటే… ఏముంది… మరోసారి వాయిదా..! అని చెప్పడమే.
అవును… అక్టోబర్ నుండి విశాఖ కేంద్రంగా సాగుతుందని చెప్పిన మాటను సవరిస్తూ ప్రస్తుతం డిసెంబర్ ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్ ను నేడు ప్రారంభించినట్లుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్, డిసెంబర్ లోగా ఇక్కడినుండే పరిపాలన సాగిస్తామని సందర్భంతో సంబంధం లేకుండా ప్రస్తావించారు.
ఇలా వాయిదాలు వేయడం ఇదేమి ప్రధమం కాదు, గత నాలుగేళ్లుగా ఇదే చేస్తూ వస్తున్నారు. మొదటగా మూడు రాజధానుల పేరుతో అమరావతి నుండి విశాఖకు షిఫ్ట్ చేయాలని ప్రయత్నించగా, అది పూర్తిగా బెడిసి కొట్టింది. ఇక ఇటీవల మూడు రాజధానుల పేర్లను పక్కన పెడుతూ విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తామని చెప్తున్నారు.
కనీసం ఈ సారైనా చెప్పిన మాట మీదైనా నిలబడితే, ఏపీకి రాజధానిగా విశాఖ పేరునైనా చెప్పుకుందామని రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తోంది. “ఏపీ రాజధాని” అన్న మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మేమ్స్ చేసే వారికి ఉపయోగపడుతోంది తప్ప, రాష్ట్రానికి గానీ, దేశానికి గానీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.



