ఓ ఏడాది క్రితం వరకు 175 సీట్లు మావే అనేవారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వారు.
టిడిపి, జనసేన ఇంకా ఎన్ని పార్టీలు కట్టకట్టుకువచ్చినా సింగిల్ సింహాన్ని ఎవరూ ఓడించలేరనేవారు. ఎన్నికల గంట మ్రోగిన తర్వాత తాను అభిమన్యుడుని కాదు… అర్జునుడినని పద్మవ్యూహం చెందించడం ఎలాగో తనకు బాగా తెలుసని చెప్పుకునేవారు.
ఈ నమ్మకానికి కారణం సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో 99 శాతం మందికి మేలు చేయడమే… కనుక పైన దేవుడు, ఎదురుగా ప్రజల ‘షల్లని దీవెనలు’ తనకే ఉన్నాయని చెప్పుకునేవారు.
కానీ జగన్ నోట ఇప్పుడు ఆ 175 సీట్ల ఊసే లేదు. మొహంలో ఆనాటి చిర్నవ్వులు కనిపించడం లేదు. ‘షల్లని దీవెనలు’ ఉన్నా జగన్ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదంటున్నారు.
చంద్రబాబు నాయుడు కేంద్రానికి చాడీలు చెప్పి పోలీస్ ఉన్నతాధికారులందరినీ తప్పించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి సంక్షేమ పధకాలన్నిటినీ ఆపించేస్తున్నారని జగన్ ఆవేశపడుతున్నారు. అసలు ఏపీలో తాను ఉండకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాల గురించి తెలుసుకోకుండా, ప్రధాని నరేంద్రమోడీ కూడా చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, తనను, తన ప్రభుత్వాన్ని, పాలనను అనరాని మాటలు అనేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఇన్‌చార్జిలను మార్చుతున్నప్పుడే జగన్‌కు భయం మొదలైంది. ఎన్నికల గంట మ్రోగినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షాలపై జరుగుతున్న భౌతిక దాడులను గమనిస్తే ఓటమి భయంతోనే ఆవిదంగా చేస్తున్నట్లు స్పష్టమయ్యింది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, టిడిపి, జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్‌కు రాష్ట్రంలోని పోలీస్ అధికారుల తీరుపై అభ్యంతరం చెపుతూ పిర్యాదులు చేశారని కూడా వైసీపికి తెలుసు. అసలు తమ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే చంద్రబాబు నాయుడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని కూడా జగన్‌కు తెలుసు. కనుక ఇటువంటి ఘటనలు జరిగితే ఈసీ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని కూడా వైసీపికి తెలుసు.
అయినా వైసీపి డీఎన్ఏలో అరాచక ఆలోచనలు, లక్షణాలను ఇప్పటికిప్పుడు మార్చుకోలేదు. కనుక ఎప్పటిలాగే చెలరేగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ చెప్పారు కూడా. కనుక ఈసీ ఇంకా కళ్ళు మూసుకొని కూర్చుంటుందని జగన్ ఆశించడం అత్యాశ… అవివేకమే కదా?
తెలంగాణలో కేసీఆర్‌లాగ జగన్ కూడా ఎన్నికల సమయంలో పోలీస్ ఉన్నతాధికారులను చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ ఎన్నికలను తనకు అనుకూలంగా జరిపించుకోవాలని అనుకున్నారు. కానీ సరిగ్గా పోలింగ్‌కు ముందు ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై ఈసీ వేటు వేసింది. ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.
మరోపక్క చంద్రబాబు నాయుడు ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అనే బ్రహ్మాస్త్రాన్ని జగన్‌పైకి సందించారు. వైసీపి ఓటమికి అదొక్కటే చాలనిపిస్తోంది.
ఈ ఎన్నికలలో కూడా కేసీఆర్ తమకు సాయపడతారని అనుకుంటే ఆయన కూడా చేతులు ఎత్తేశారు. కనుక అర్జునుడు వేషం వేసుకొని పద్మవ్యూహంలోకి ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి, దానిలో చిక్కుకుపోయాయని ఆలస్యంగా గ్రహించిన్నట్లున్నారు. ఈసారి ఎన్నికలలో ఓడిపోబోతున్నామనే ఆక్రోశమే జగన్ మాటల్లో వినిపిస్తోందిప్పుడు.
కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో సహా అన్నీ స్వయంకృతమే. కానీ నేటికీ తన వల్లే వైసీపి ఓడిపోబోతోందనే విషయం ఒప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక ఈసీని, మోడీని కూడా తప్పు పడుతున్నారు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?
Jagan In Complete Panic Mode
జగన్ మాటల్లో స్పష్టంగా భయం…
"నాకు ఎన్నికలు బాగా జరుగుతాయి అనే నమ్మకం రోజు రోజు కి సన్నగిల్లుతుంది… డబ్బులు ఆపేస్తున్నారు… అధికారుల్ని ఇష్టానుసారంగా మారుస్తున్నారు"
Indication of TDP+ winning Elections?#YSJagan pic.twitter.com/xNX08zzIKq
— M9 NEWS (@M9News_) May 6, 2024






