అక్రమాస్తుల కేసులలో ప్రతి శుక్రవారం నాడు విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్, ఈ రోజు కూడా నాంపల్లి సీబీఐ కోర్టు మెట్లేక్కారు. జగన్ తో పాటు ఈ కేసులలో ఏ2 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ ల పెట్టుబడుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ కోర్టును జగన్ కోరగా, జగన్ విజ్ఞప్తికి సీబీఐ అడ్డుకట్ట వేసింది.
పెట్టుబడిదారులను జగన్ మోసం చేసినట్టు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపి, జగన్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇటీవల ఏదొక అంశానికి సంబంధించి, జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయడం, దానిని ప్రతిసారి కోర్టు తోసిపుచ్చడం క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది.
వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇటీవల జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ అవసరాలకు ఇలాంటి సౌలభ్యాలను ఇవ్వలేమంటూ జగన్ పై అక్షింతలు వేసి మరీ హెచ్చరించగా, తాజాగా మరో పిటిషన్ ను దాఖలు చేసారు. మరి దీనిపై సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో గానీ, జగన్ కు అనుకూలంగా రావడానికి ఆస్కారం లేకుండా సీబీఐ అయితే బ్రేకులు వేసినట్లే కనపడుతోంది.


