విజయవాడ వరద బాధితులకి వైసీపి అధినేత, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?
అయితే దీనిని నగదు రూపంలో కాకుండా బాధిత కుటుంబాలకు పాల ప్యాకెట్లు, నీళ్ళ బాటిల్స్, నిత్యావసర సరుకుల రూపంగా అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నేటి నుంచే వైసీపి కార్యకర్తలతో బాధిత కుటుంబాలకు వాటి పంపిణీ చేస్తామని చెప్పారు. మిగిలిన సొమ్ముతో స్థానిక అవసరాలను బట్టి సహాయం అందిస్తామని చెప్పారు.
అంతా సవ్యంగా ఉంటే ఈ పాటికి లండన్‌లో ఉండాల్సిన జగన్, మోకాలిలోతు బురద నీటిలో విజయవాడలో తిరగాల్సివస్తోంది. అందుకు లోలోన బాధపడుతున్నా, వరద, బురద రాజకీయాలు చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నారు. అయితే అవగాహన లేక నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు.
Also Read – అతితెలివి ప్రదర్శించినా జగన్ దొరికిపోయారుగా!
కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు పడుతుంటే, కృష్ణానదిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీళ్ళు పొంగి ప్రవహిస్తుంటే, ఇది ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అని వాదించి నవ్వులపాలయ్యారు.
ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన జగన్‌కి బుడమేరుకి గేట్లు లేవనే సంగతి తెలియకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడానికే లేని ఆ గేట్లు ఎత్తివేసి విజయవాడని ముంచేశారని జగన్ అన్నప్పుడు ఆ మాటలని విని అంత కష్టంలో కూడా విజయవాడ ప్రజలు నవ్వుకున్నారు.
Also Read – ఆ నోటి దురదతోనే కేసీఆర్, జగన్….
జగన్ కోటి రూపాయల విరాళం నిజంగా ఇస్తారో లేక పార్టీ నాయకుల చేత పాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయించేసి ‘మమ’ అనిపించేస్తారో తెలీదు కానీ కోటి రూపాయల విరాళం ఇస్తున్నారంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేసేసుకుంటున్నారు. అంటే దీని ద్వారా కూడా రాజకీయ మైలేజ్ పొందాలని ఆరాటపడుతున్నారన్న మాట!
అయితే జగన్ 5 ఏళ్ళపాటు సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టినా పట్టించుకొని ప్రజలు, ఇప్పుడు ఓ కోటి రూపాయలు విరాళం ఇస్తే పట్టించుకుంటారా?అంటే కాదనే చెప్పవచ్చు. కనుక ఈ పేరుతో సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకునే బదులు, ఈ కష్ట కాలంలో ప్రజల వద్దకు వెళ్ళి చేతనైన సాయం చేస్తే దానిని ప్రజలు తప్పక గుర్తిస్తారు. గౌరవం కూడా పెరుగుతుంది కదా?