జూన్ 4న ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఎగ్జిట్ పోల్స్ పట్టుకొని ఇప్పుడే వైసీపి(ఓటమి)ని పోస్ట్ మార్టం చేయడం తొందరపాటే అవుతుంది. కానీ వైసీపి ఓటమికి అనేక కారణాలు కళ్ళ ముందే కనబడుతున్నా కూడా వైసీపి నేతలందరూ దృతరాష్ట్రుడు కోసం కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాన్ని చీకటిమయం చేసుకున్న గాంధారిలా, 175 సీట్లనే గుడ్డి భ్రమలో ఉండిపోయారని చెప్పక తప్పదు.
ఒక పొరపాటు చేస్తే దానిని గుర్తించి వెంటనే సరిదిద్దుకోవడం విజ్ఞుల లక్షణం. కానీ వరుసగా పొరపాట్లే చేస్తూ అవే సరైనవని గుడ్డిగా నమ్ముటూ అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ప్రజావేదిక కూల్చేసిననాడే వైసీపిలో ఎవరైనా ధైర్యం చేసి ఇది తప్పని జగన్‌కు గట్టిగా చెప్పి ఉండి ఉంటే, ఆ ఒక్క పొరపాటుని ప్రజలు క్షమించేవారే… కానీ మూడు రాజధానులు, విశాఖ రాజధాని, సంక్షేమ పధకాలే సర్వరోగ నివారిణి అనుకోవడం, వాలంటీర్లు, సచివాలయాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఆటలు ఒకటా రెండా… అన్నీ తప్పులే తప్ప చేసిన ఒక్క మంచి పని కనిపించడం లేదు.
పైగా అయినవాళ్ళను విజయమ్మ, షర్మిలను దూరం చేసుకొని, అవినాష్ రెడ్డిని చంకనెక్కించుకుని ఎన్నికలలో తమ ఓటమికి తామే జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఎవరు సలహా ఇచ్చారో గానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే టిడిపి తుడిచిపెట్టుకుపోతుందని, ఆ ఒక్క నిర్ణయంతోనే అనేక వర్గాల ప్రజలను టిడిపివైపు మొగ్గేలా చేశారు.
ఒక వ్యక్తి వరుసగా ఇన్ని తప్పులు చేయగలగడం గిన్నీస్ బుక్ రికార్డులో నమోదు చేయాల్సిన విషయమే కదా? తమ అధినేత వరుసపెట్టి ఇన్ని తప్పులు చేస్తున్నా వైసీపిలో ఎవరూ పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా వైసీపిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుండటం, అందినకాడికి దోచుకోవడం ఈ 5 ఏళ్ళు ఓ మహా యజ్ఞంలా చాలా దీక్ష దక్షతలతో చేశారు.
అందరూ మూకుమ్మడిగా తప్పులు చేసుకున్నాక ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేసుకుంటే ప్రజలు తమని గుర్తుపట్టలేరని అనుకోవడం అతితెలివే కదా?
ఓటమి అంచున నిలబడి హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఇంకా కౌంటింగులో ఘర్షణలు తప్పవు… ఈసీ రాంగ్ ఎంపైరింగ్ చేసింది… టిడిపి రిగ్గింగ్ చేసింది… మీడియా బోగస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడటం చూస్తే పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోనే పోవాలని పెద్దలు ఎందుకు అన్నారో అర్దమవుతుంది.




