“అన్నోస్తున్నాడు… నవరత్నాలు తెస్తున్నాడు…” ఇది ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం. ఇదే స్లోగన్ తో అక్టోబర్ 27వ తేదీ నుండి రాష్ట్రంలోని 13 జిల్లాలలో పాదయాత్ర చేస్తానని… తద్వారా 2019లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని భావిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశలపై పవన్ నీళ్ళు జల్లినట్లే కనపడుతున్నాడు. అవును… ఏ సమయమైతే పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారో, బహుశా అంత కంటే కొన్ని రోజుల ముందే పవన్ ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ అధికారిక ప్రకటన చేసారు ‘జనసేన’ అధినేత.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా అక్టోబర్ నాటికల్లా ముగుస్తుందని, ఆ తర్వాత ఎక్కువ సమయం ప్రత్యక్ష రాజకీయాల్లోనే గడుపుతానని పవన్ స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా కాకుండా ఒప్పుకున్న మరో రెండు సినిమాల నిర్మాతలను విజ్ఞప్తి చేస్తానని, తాను వీలు చిక్కినప్పుడే నటిస్తానని చెప్తానని, దాదాపుగా 2/3వ శాతం సమయం రాజకీయాలకే కేటాయిస్తానని తెలిపారు. ముందుగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం దృష్టి సారిస్తానని, అయితే అది పాదయాత్ర ద్వారానా లేక మరో మార్గమా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు, ఉద్దానం లాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వాటిని తెలుసుకుంటానని అన్నారు.
ఒక సినీ హీరోగా, ‘జనసేన’ అధినేతగా పవన్ పబ్లిక్ లోకి వస్తే ఉండే ప్రభంజనం ఏమిటో తెలియనిది కాదు. ఈ విషయం పవన్ కు కూడా బాగా తెలుసు. ప్రస్తుతం తన కారే ముందుకు కదిలే పరిస్థితులలో లేదు, అదే పాదయాత్ర అంటే శాంతిభద్రతల సమస్య రాకుండా చూసుకోవాలి, అందుకే ఎలా చేరువ కావాలి అన్నది ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అయితే పవన్ ఎలాంటి మార్గంలో ప్రజల్లోకి వచ్చినా… జగన్ పాదయాత్ర కంటే జనసేన అధినేత పైనే మీడియా కళ్ళు ఫోకస్ అయి ఉంటాయని చెప్పొచ్చు. దీంతో పాదయాత్ర ద్వారా లబ్ది పొందాలన్న జగన్ ఆశలకు రాజకీయంగా పవన్ దాదాపుగా గండి కొట్టినట్లే భావించవచ్చు.
అలాగని ఇదేదో తెలుగుదేశం పార్టీకి సాయం చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. దీనిపై కూడా ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని పవన్ వ్యక్తపరిచారు. రాష్ట్రం కోసం బహిరంగంగానే తెలుగుదేశం – బిజెపిలకు స్నేహహస్తం అందించా… ఇందులో రహస్యం ఏముంది… అవసరమైతే ఎదిరిస్తా… సొంత బంధుత్వం అన్నయ్యనే కాదనుకుని పార్టీ స్థాపించిన వాడికి ఈ స్నేహాలు ఎంత? అంటూ పవన్ చెప్పిన సమాధానంతో రాజకీయాలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్తున్నట్లుగా కనపడుతున్నాడు. పవన్ పోకడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా చేటు చేయకపోయినా… జగన్ కు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పడంలో సందేహం లేదు.
అందుకేనేమో… గత రెండు రోజుల నుండే పవన్ కళ్యాణ్ పై జగన్ మీడియా విషం చిమ్ముతూ వరుస కధనాలను ప్రసారం చేస్తోంది. ఇప్పటివరకు టిడిపికి ప్రత్యామ్నాయంగా జగన్ ఒక్కరే ఉంటారని భావించిన సమయంలో… అక్టోబర్ నుండే తన రాజకీయ ప్రణాళికలు సిద్ధమయ్యాయన్న పవన్ ప్రకటనతో… ప్రజలలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే చాలా సేటిల్డ్ గా పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పడంతో… రాజకీయాలపై ఫోకస్ బాగా చేస్తున్నారని అర్ధమవుతోంది. ఈ పరిణామాలన్నీ శుభ సూచకాలే… ఒక్కరికి తప్ప… మరి ఆ యువనేత పవన్ ను ఎలా ఎదుర్కొంటారో… ఎలా చక్రం తిప్పుతారో..!?


