వైసీపీలో కట్టప్ప ఉన్నాడా? ఎవరు?

Jagan-YSRCP-Lifetime-Presidentగత మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో పప్పు బెల్లాలాగా ఓటర్లకు పంచిపెడుతోంది. కనుక “175 సీట్లు మనమే గెలవాలి… మనమే గెలుస్తాం” అని సిఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెపుతున్నారు. కానీ ఆయన మాటలలో వినబడుతున్న నమ్మకం చేతలలో కనబడటం లేదు.

ADVERTISEMENT

ఆయనకు రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించమని ప్రజలు అఖండమెజార్టీతో అధికారం కట్టబెడితే, ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే సన్నాహాలు చేసుకొంటుండటమే ఇందుకు నిదర్శనం. అయితే మనది ఎంత గొప్ప ప్రభుత్వం అనుకొన్నా… ఆల్ ఈజ్ వెల్ అని ఎన్ని పాటలు పాడుకొంటున్నా… ఎన్నికలంటే అధికారంలో ఉన్న ప్రతీ పార్టీకి భయమే. ఎందుకంటే తమ గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉంటాయి కనుక. అందువలన జగన్‌ ప్రభుత్వం కూడా అభద్రతాభావంతో ఉండటం సహజమే.

కానీ వైసీపీలో మంత్రులతో సహా అందరూ “మీరే మా దేవుడు… మీ దయతోనే మాకు ఈ అధికారం, పదవులు, గౌరవం వచ్చాయి… మీ కోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్దం… మరో 20-30 ఏళ్ళు మీరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి… మీరు ప్రధానమంత్రి కావాలని దేశప్రజలు కోరుకొంటున్నారు…” అంటూ విధేయత ప్రకటిస్తూనే ఉన్నారు.

బహుశః తల్లి విజయమ్మతో ఏమైనా సమస్య ఉంటుందేమో అని సందేహం కలిగిందో ఏమో ఆమె చేత రాజీనామా చేయించి బయటకు పంపించారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మనసులో ఇంకా ఏమూలో భయం అభద్రతాభావం నెలకొని ఉన్నాయా?అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, వైసీపీకి శాశ్విత అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకోవడమే.

నిజానికి ప్రతీ రాజకీయ పార్టీలో ప్రతీ రెండేళ్ళకోసారి మొక్కుబడిగా అధ్యక్ష ఎన్నికలు జరుపుతుండటం, వాటిలో పార్టీ అధినేత ఒక్కరే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికవుతుండటం పరిపాటే. వైసీపీ కూడా అందుకు అతీతం కాదు. కనుక వైసీపీ ఉన్నంత కాలం దానికి జగన్మోహన్ రెడ్డే అధ్యక్షుడిగా ఉంటారని వేరే చెప్పక్కరలేదు. కనుక శాశ్విత అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకోవలసిన అవసరమే లేదు.

కానీ చేసుకొన్నారంటే… పార్టీలో కట్టప్ప ఎవరో ఉన్నారని జగన్ అనుమానిస్తున్నట్లే ఉంది. ఆ కట్టప్ప తిరుగుబాటు చేసి తనను పార్టీలో నుంచి వెళ్ళగొట్టి పార్టీ పగ్గాలు చేపడతారనే భయం ఉండి ఉండవచ్చు. అటువంటి ప్రమాదం ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యగా శాశ్విత అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ మన ఎన్నికల నియామావళి ప్రకారం దేశంలో అన్ని పార్టీలు విధిగా రెండేళ్ళకోసారి అధ్యక్ష ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కానీ ఆ అవసరం లేకుండా జగన్ పట్టాభిషేకం చేసుకొన్నారు. మరి దీనికి ఎన్నికల కమీషన్ అంగీకరిస్తుందా? చూడాలి.

తన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అనుమానం, భయం ఉండటం సహజమే కానీ పార్టీ పగ్గాలు కూడా తన చేతుల్లోనే ఉంటాయా లేదా?కట్టప్ప వచ్చి పార్టీని ఎత్తుకుపోతాడని జగన్‌ భయపడుతుండటమే చాలా ఆశ్చర్యకరం. ఇంతకీ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో ఆ కట్టప్ప ఎవరు?

ADVERTISEMENT
Latest Stories