మా అన్నావదినలు పండక్కి పట్టుబట్టలు కట్టుకుంటే సరిపోతుందా?

YS Sharmila

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు అన్న జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప ఏనాడూ వదిన భారతి జోలికి పోలేదు. కానీ తొలిసారిగా ఆమెపైకూడా చిన్నగా విమర్శలు మొదలుపెట్టారు.

శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, కాకినాడ జిల్లా తునిలో వైఎస్ షర్మిల తన అన్న రాష్ట్ర ప్రజలను ఏవిదంగా దోచుకుంటున్నారో వైఎస్ షర్మిల వివరించారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, ఈ ఛార్జీలు, దోపీడీ, దౌర్జన్యాలను భరించలేక ప్రజలు నానా బాధలు పడుతుంటే, సిఎంగారు, ఆయన భార్య పట్టుబట్టలు కట్టుకుని సంక్రాంతి పండుగ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పట్టుబట్టలు కట్టుకుని పండుగ చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్లేనా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

“జగనన్న, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక, లిక్కర్, మైనింగ్ దోపిడీ చేస్తూ రాష్ట్రాన్ని దోచేసుకుంటూ, సంక్షేమ పధకాల పేరుతో మీ చేతిలో పదో పరకో పెట్టి ఏదో మేలు చేశానని చెప్పుకుంటున్నారు. సంక్షేమ పధకాల పేరుతో జగనన్న మీ చేతుల్లో ఓ మట్టి చెంబు పెట్టి, మీ ఇంట్లో వెండి చెంబు ఎత్తుకుపోతున్నారు.

మా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పారు. కానీ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోంది.

ఈ 57 నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, ఐ‌టి కంపెనీని రప్పించలేకపోయారు. ఐదేళ్ళు మాయమాటలతో కాలక్షేపం చేసేసి, నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంటే ఇప్పుడు డీఎస్సీ అంటూ హడావుడి చేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన తండ్రికీ, అన్నకు మద్య ఉన్న ఓ ముఖ్యమైన తేడాని కూడా ప్రజలకు వివరించి చెప్పారు.

“మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఎల్లపుడూ ప్రజల మద్యనే ఉండేవారు. మంత్రులు, అధికార ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉండేవారు. ఎవరైనా ఆయనను నేరుగా కలిసే అవకాశం ఉండేది. కానీ జగనన్న తాడేపల్లి ప్యాలస్ బయటకు రాడు. ఎవరికీ లోపలకు అనుమతి లభించదు. కనీసం తన మంత్రులు, ఎమ్మెల్యేలను కలవరు.

కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో ప్యాలస్‌లో నుంచి బయటకు వచ్చి ‘సిద్దం’ అంటున్నారు. దేనికి సిద్దం? మళ్ళీ గెలిపిస్తే మరో రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేయడానికి సిద్దం అని చెపుతున్నారా? మద్యపానం, పేదలకు ఇళ్ళు, ప్రత్యేక ప్రత్యేక హోదా పేర్లతో మళ్ళీ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్దం అంటున్నారా?దేనికి? అని ప్రశ్నించారు.

ఇదివరకు ఇవే ప్రశ్నలు టిడిపి లేదా జనసేన నేతలు అడిగితే, వారు తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారంటూ వైసీపి నేతలు తేలికగా కొట్టిపడేసేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నది, విమర్శలు చేస్తున్నది ఎవరూ కాదు వారి అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. అందుకే వైసీపి నేతలు ఆమెకు జవాబులు చెప్పుకోలేక సతమతమవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories