ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా మారి తీవ్ర ఇబ్బంది పెడుతున్న వైఎస్ షర్మిలని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక మొదట్లో వైసీపి నేతలు తలలు పట్టుకున్నా, వైసీపి మేధావులు అందరూ కలిసి కొన్ని పాయింట్స్ కనిపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతల చెవిలో చెప్పారు. ఆ ప్రకారమే అందరూ ఆమెను విమర్శిస్తున్నారు. ఎదుర్కొంటున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల చేతులు కలపడం సిగ్గుచేటు. వైఎస్ షర్మిల తాను వైఎస్ బిడ్డనని చెప్పుకొంటూ తండ్రిని అవమానించినవారితో, అన్నను వ్యతిరేకిస్తున్నారితో చేతులు కలపడం చాలా దారుణం.
వైఎస్ షర్మిలకు వైఎస్ కూతురు అనే తప్ప సొంత గుర్తింపు లేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలన్నట్లు తండ్రి పేరు చెప్పుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారు. తెలంగాణలో ప్రజలు తరిమేస్తే ఏపీకి వచ్చిపడ్డారు. అన్నకు వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడుతో వైఎస్ షర్మిల చేతులు కలిపి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు.
వైసీపిలో అందరూ కాస్త అటూ ఇటూగా లేదా వేరే రకంగా ఇవే మాటలు వల్లెవేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. నేడు మంత్రి రోజా కూడా ఇవే చెప్పారు. “వైఎస్ బిడ్డ అని తప్ప నీకంటూ వేరే గుర్తింపు ఉందా?”అని మంత్రి రోజా ప్రశ్నించారు.
మంత్రి రోజాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తూ ‘మా నమ్మకం, మా భవిష్యత్ నువ్వే జగన్’ అంటూ భజన చేస్తుంటే, వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా తనకంటే దేశముదురు కాంగ్రెస్ సీనియర్ నేతలని తన వెంట నడిచేలా చేస్తున్నారు.
రోజాకు మంత్రి పదవి, జగన్ ఆశీర్వాదం రెండూ ఉన్నాయి. కానీ వైఎస్ షర్మిలకు ఆ రెండు లేకపోగా, ఆంధ్ర ప్రజలు ఛీకొట్టిన కాంగ్రెస్ పార్టీతో చాలా ధైర్యంగా ప్రజల మద్యకు వెళ్ళి మాట్లాడుతున్నారు. సొంత అన్నతోనే ధైర్యంగా పోరాడుతున్నారు కూడా.
వైసీపి నేతలు ప్రజల నమ్మకాన్ని, ఆ కారణంగా తమ అధినేత నమ్మకాన్ని కూడా కోల్పోతుంటే, వైఎస్ షర్మిల ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఏనాడూ ప్రెస్‌మీట్ పెట్టి మీడియాని ఎదుర్కోలేదు కానీ వైఎస్ షర్మిల నిత్యం మీడియాని, తనని విమర్శించే వైసీపి నేతలను, కాంగ్రెస్‌ని వద్దనుకున్న రాష్ట్ర ప్రజలను ఎదుర్కొని మాట్లాడుతూనే ఉన్నారు.
కనుక జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల కంటే వైఎస్ షర్మిల చాలా ధైర్యవంతురాలు. మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని అర్దమవుతూనే ఉంది. ఈ విషయం ఆమెకూ తెలుసు. అందుకే ఆమె చాలా ధైర్యంగా రాష్ట్రంలో దూసుకుపోగలుగుతున్నారు.
ఆమెను విమర్శిస్తున్న రోజా వంటి వైసీపి నేతలకూ కూడా తమ కంటే ఆమె వంద రెట్లు మెరుగైన నేత అని తెలుసు. కానీ ఆ ముక్క బయటకు చెప్పలేరు. బహుశః ఎన్నికలలో వైసీపి ఓడిపోయాక చెప్తారేమో… తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతల్లాగ!




