ఉంగరం పడిపోతే అది ఎక్కడ పడిందో అక్కడే వెతుక్కోవాలి. అప్పుడే అది దొరికే అవకాశం ఉంటుంది. కానీ వైఎస్ షర్మిల ఏపీలో ఉంగరం పోగొట్టుకొని దాని కోసం తెలంగాణలో 3,000 కిమీ తిరిగారు. కనుక దొరకలేదు!
తెలంగాణలో పార్టీ పెట్టుకొని ప్రయత్నించడం తప్పు కాదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ‘రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ’ చెప్పుకోవడం మరో పెద్ద తప్పు. పరాయి పాలన వద్దనుకొని విడిపోయిన తెలంగాణ ప్రజలకు మళ్ళీ పరాయి పాలన తెస్తానని ఆమె చెప్పుకోవడం రాజకీయ అవివేకమే కదా?
అయినా చేతి నిండా డబ్బు ఉంది కనుక ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసుకొన్నారు. బహుశః ఆ కారణంగానే కొంతమంది ఆమె వెంట తిరిగారు. వారిని వెంటబెట్టుకొని ఆమె ఎంచుకొన్న మార్గంలోనే ముందుకు సాగి ఉన్నా నేడు ఆమె పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గానే ఉండేది.
కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దపడటంతో తన చేతులతోనే తన పార్టీ పీక పిసికి చంపేసుకొన్నట్లయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె చేరికను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమెకు ఈ ఎదురుదెబ్బ తగిలింది.
నిజానికి ఈ ప్రతిపాదన వచ్చినప్పుడే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమకు ఆమె అవసరం లేదని, తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు లేదని చెప్పేశారు. అప్పుడే ఆమె మేల్కొని ఉంటే తక్కువ నష్టంతో బయటపడి ఉండేవారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వద్దంటున్నా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి చేరాలని ప్రయత్నించి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అభాసుపాలయ్యారు.
ఆమె తన రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్‌లో పార్టీలో చేరిపోయి, తనను నమ్ముకొని వచ్చినవారికి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దపడటంతో వారు కూడా దూరం అయిపోయారు. కానీ ఆమెకు హస్తం పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ వెనక్కు వచ్చి వారినే ఆశ్రయించాల్సి వచ్చింది.
పరువు కోసం 119 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించడం మరో పెద్ద పొరపాటు. ఇప్పుడు ఆమె టికెట్స్ ఇస్తానని పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతవరకు 62 మంది మాత్రమే దరఖాస్తు చేసుకొన్నట్లు సమాచారం. వారిలో నలుగురు వైఎస్ షర్మిల (2స్థానాలు), ఆమె భర్త అనిల్ (1), విజయమ్మ (1) ఉన్నారు.
ఒకవేళ పరువు కోసం ఎలాగో 119 మంది అభ్యర్ధుల చేత నామినేషన్స్ వేయించినా ఆ డిపాజిట్ సొమ్ము కూడా వృధా అవుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్, బిఆర్ఎస్ ధాటిని తట్టుకోవడానికి బీజేపీ తరపున ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్, జేపీ నడ్డా వంటివారు ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంకా గాంధీ, ఇంకా అనేకమంది హేమాహేమీలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్, కొమ్ములు తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెపుతున్న వైఎస్ షర్మిలని ఎవరు పట్టించుకొంటారు?
వైఎస్ షర్మిల తన జగనన్న కోసం చాలా కష్టపడ్డారు. తత్ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ఆమె కష్టం ఆమెకు ఉపయోగపడలేదు. ఆమె ఎంచుకొన్న మార్గం, తీసుకొన్న తప్పుడు రాజకీయ నిర్ణయాలే ఇందుకు కారణమని చెప్పక తప్పదు.




