ఏ ఎన్నికలలోనైనా ఓ రాజకీయ నాయకుడు లేదా ఓ పార్టీ లేదా ఓ అంశం ‘గేమ్ చేంజర్’గా ఉంటుంది. జీవించి ఉన్నవారే కాకుండా చనిపోయినవారు కూడా తమ ప్రమేయం లేకుండానే గేమ్ చేంజర్ అవుతుంటారు. ఈసారి ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో సంక్షేమ పధకాలు లేదా అమరావతి గేమ్ చేంజర్ అవుతాయనుకుంటే, హటాత్తుగా స్వర్గీయ వివేకానంద రెడ్డి గేమ్ చేంజర్‌గా మారారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండటమే సంచలనం అనుకుంటే, ఇప్పుడు ఆమె వివేకా హత్య కేసు గురించి అన్న జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిలను గట్టిగా నిలదీస్తూ వారికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారు.
మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వివిద అంశాల గురించి మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు వివేకా హత్యలో వారి వాదనలపైకి మళ్ళింది. అంటే ఇదే ఎన్నికలలో గేమ్ చేంజర్‌గా మారిన్నట్లు భావించవచ్చు. కనుక ఏదోవిదంగా వారిద్దరినీ వైసీపి నిలువరించక తప్పదు.
జగన్, వైసీపి నేతలు ఇంతకాలం సంక్షేమ పధకాలతో మేలు పొందిన లబ్ధిదారులను, వాలంటీర్లను నమ్ముకొని ఈసారి ఎన్నికలలో కూడా తప్పకుండా విజయం సాధించగలమనే నమ్మకంతో ఉండేవారు. కనుక చంద్రబాబు నాయుడుని, టిడిపిని అడ్డుతొలగించుకుంటే చాలు రాష్ట్రంలో విజయం మనదే అని జగన్మోహన్ రెడ్డి అనుకునేవారు. ఆ దిశలో అనేక ప్రయత్నాలు చేశారు.
కానీ ఆ ప్రయత్నాలు శ్రుతి మించడంతో టిడిపికి జనసేన కలిసింది. కనీసం అప్పటికైనా వైసీపి వెనక్కు తగ్గి ఉంటే కధ ఇంతవరకు వచ్చేది కాదేమో? కానీ ‘చొక్కా మడత పెట్టి ఎన్నికలలో యుద్ధం చేద్దాం’ అని జగన్ బెదిరించడం చంద్రబాబు నాయుడు బీజేపీని కూడా కలుపుకున్నారు.
వారి కూటమిని ఎదుర్కోవడానికే జగన్ ఆపసోపాలు పడుతుంటే, ఇప్పుడు ఇద్దరు చెల్లెమ్మలు షర్మిల, సునీతా హటాత్తుగా దిగిపోయి కేవలం మూడు రోజులలో వివేకా హత్య కేసుని బాగా హైలైట్ చేయడంతో ఏమీ చేయాలో పాలుపోవడం లేదు.
కానీ వారిద్దరిని వెంటనే నిలువరించలేకపోతే, వైసీపికి జరిగే నష్టం అంతా ఇంతాకాదు. కానీ వారి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వద్ద కూడా సమాధానం లేదు!
ఇంతకాలం కడపలో జగన్, అవినాష్ రెడ్డి, వారి బంధువర్గాన్ని వ్యతిరేకించలేక మౌనంగా ఉండిపోయిన విరోధులు జిల్లాలో హటాత్తుగా మారిన ఈ పరిస్థితులను చూసి అందరూ ధైర్యంగా బయటకు వచ్చి వైఎస్ షర్మిలకు అండగా నిలబడటం ఖాయమే.
అప్పుడు అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదు. అవినాష్ రెడ్డి ఓటమి అంటే జగన్ ఓటమే అవుతుంది. కడపలో వైసీపి గుత్తాధిపత్యం దెబ్బ తింటే ముందుగా ఆ ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపై పడుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలపై కూడా పడుతుంది.
కనుక కడపలో అన్నా చెల్లెళ్ళ మద్య చాలా ‘ప్రమాదకరమైన యుద్ధం’ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే జగన్మోహన్ రెడ్డి గ్రహస్థితి బాగోలేదని అర్దమవుతోంది.






