నేడే అవినాష్ రెడ్డి అరెస్ట్‌?చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లేనా?

YS_Bhaskar_Reddy_YS_Avinash_Reddyవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ అధికారులు సిద్దమైన్నట్లున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయంలో ఈ కేసులో విచారణకు హాజరుకావలసిందిగా ఆయనకు నిన్న నోటీస్ ఇచ్చారు.

ఇదే కేసులో ఆయన అనుచరుడు ఉదయ్ కుమార్‌ రెడ్డిని, ఆ మర్నాడు భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. భాస్కర్ రెడ్డిని 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకి తరలించారు.

ADVERTISEMENT

భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ఆదివారం కడప మేయర్‌తో సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పులివెందులలో నిన్న దుకాణాలు బంద్ చేయించారు.

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నెలాఖరులోగా సీబీఐ ఈ కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగుసార్లు ప్రశ్నించినందున నేడు 5వ సారి విచారణ పూర్తికాగానే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. సీబీఐ నోటీస్ అందుకొన్న అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం పది వాహనాలలో తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు.

అయితే ఆదివారం ఒంగోలులో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఆదిమూలం సురేష్‌ను భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించాల్సింగా విలేఖరులు కోరినప్పుడు “ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే ఉద్దేశ్యంతో మా ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరింది. కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుంది,” అని అన్నారు.

అంటే వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి సంబందం ఉందని, అందుకే సీబీఐ అధికారులు ఆయనని అరెస్ట్‌ చేశారని చెప్పకనే చెప్పిన్నట్లయింది. కానీ నోరు జారానని గ్రహించడంతో ఆయన అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయారు. ఈలోగా ఆయన మాట్లాడిన మాటలు ప్రసార మాద్యమాలలో వచ్చేశాయి.

దీంతో ఆయన తన కార్యాలయంలో మళ్ళీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, తన మాటలను మీడియా వక్రీకరించిందని సవరణ ప్రకటన చేశారు. కానీ ఓ వైపు భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ని నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే మంత్రి ఆదిమూలపు సురేష్ ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందని’ చెప్పడంతో అధినేత జగన్‌ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. భాస్కర్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని మంత్రి చెప్పారు కనుక అవినాష్ రెడ్డి విషయంలోనూ అలాగే అనుకోవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories