ఎన్నికలు సమీపిస్తున్న వేళ సాక్షి దినపత్రిక నేడో వార్త మెయిన్ పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 14,77,930 ఓట్లు తొలగించారని, వాటిలో సింహభాగం వైకాపా ఓటర్లవే అని ఆ వార్త సారాంశం. సింహభాగం ఏంటి పోయినవన్నీ మావే అంటుంది వైకాపా. టీడీపీ నేతలు స్థానిక రెవెన్యూ అధికార యంత్రాంగంతో కుమ్మక్కై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారనే ఓటర్లను తొలగించారని సమాచారం.
ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల నుంచి 15 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని సాక్షి ఆరోపణ. అత్యధికంగా కడప జిల్లాలో 3.20 లక్షల ఓట్లపై వేటు వెయ్యడమే దీనికి సాక్ష్యం అని వారి వాదన. అయితే ఇప్పటివరకు తమను కడపలో గెలిపించిన దొంగ ఓట్లు పోయాయని వైకాపా కలవరపడుతుందని తెలుగుదేశం వారి వాదన.
వైకాపాది భయమా లేక అది ఓటమికి ముందస్తు వంకలా? అనేది అసలు ప్రశ్న. వారు అన్నది నిజమే అయితే అసలు వచ్చే ఎన్నికలలో పోటీ చెయ్యడం అనవసరం. వచ్చే ఎన్నికలలో 5000 ఓట్ల తేడాతో గెలుపు నిర్ణయం అయ్యే నియోజకవర్గాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
అలాంటిది ప్రతి నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల ఓట్లు పోతే కష్టమే. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియ చేపట్టామని, ఎక్కడైనా తప్పులు జరిగితే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.



