తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ గొప్పగా చెప్పుకునేవారు. తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందంటే రాష్ట్రంలో ఒక్క ఎకరా అమ్ముకుంటే ఆంధ్రాలో మూడు ఎకరాలు కొనుక్కోవచ్చని గొప్పలు చెప్పుకునేవారు.
ఆయన పదేళ్ళపాటు తెలంగాణని పాలించారు. వేలకోట్లు ఖర్చుచేసి అమెరికా వైట్‌హౌస్‌కి తీసిపోని విధంగా గొప్పగా సచివాలయం నిర్మించారు. వేలకోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి అనేక ఐకానిక్ భవనాలు నిర్మించారు.
మరో వెయ్యి కోట్లు ఖర్చుచేసి యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో నిర్మించిన ఓ పాఠశాల భవనం శిధిలావస్థకు చేరుకున్నా పట్టించుకోలేదు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల కోట్లతో మూసీ, గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులు మొదలుపెడుతోంది. కానీ అది కూడా ఆ పాఠశాలని పట్టించుకోలేదు!
రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా శిధిలావస్థకు చేరుకున్న ఆ పాఠశాల భవనం పైకప్పు నేడు కూలిపోయింది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.
ఈరోజు ఉదయం ప్రార్ధన తర్వాత చిన్నారులు తరగతి గదుల్లోకి వెళ్ళినప్పుడు భవనంలో ఒకవైపు పైకప్పు కూలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లలకు ఏమీ కాలేదు.
సుమారు 70 ఏళ్ళ క్రితం నిర్మించిన పాఠశాల శిధిలావస్థకు చేరుకునందున దాని స్థానంలో కొత్తది నిర్మించాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చాలా కాలం నుంచి కోరుతున్నారు.
కానీ ఇతర ప్రాజెక్టులకు వేలు, లక్ష కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు పాఠశాల భవన నిర్మాణానికి ఓ 20-30 లక్షలు కేటాయించలేకపోయాయి.
అంటే తెలంగాణ పాలకుల ప్రాధాన్యతలు వేరు.. ప్రజల అవసరాలు వేరనుకోవాలేమో? శిధిలావస్థకు చేరి కూలిన పాఠశాల భవనం ఇదేనా తెలంగాణ అభివృద్ధి?అని ప్రశ్నిస్తున్నట్లుంది.




