పరాయి భాషల్లో మన తెలుగు సినిమాల్ని కనీస స్థాయిలో పట్టించుకోకపోయినా.. మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా భాషతో సంబంధం లేకుండా బాగున్న ప్రతి సినిమాని ఆదరిస్తారు. మన బడా తెలుగు సినిమాలకేమో బేసిక్ ఓపెనింగ్స్ కూడా ఉండవు. పోనీ ఇంత కలెక్షన్స్ ఇచ్చి, క్రేజ్ ఇచ్చి, మార్కెట్ క్రియేట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకుల్ని సదరు పరభాషా నటీనటులు-దర్శకనిర్మాతలు గౌరవిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి.
గతంలో “వెట్టయాన్, వలిమై, పళ్ళిచట్టంబి” వంటి సినిమాలు కనీసం తెలుగులో టైటిల్ కూడా పెట్టకుండా రిలీజ్ చేసారు. వాటి రిజల్ట్స్ ఏమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మలయాళంలో, రేపు తెలుగులో విడుదలకానున్న “ఐ నో బడీ” అనే సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఇంగ్లీష్ టైటిల్ అవ్వడం వల్ల తెలుగులో ఎలాగు టైటిల్ మార్చాల్సిన అవసరం రాలేదు. కనీసం తెలుగు ఫాంట్ & ట్రాన్సలేషన్ విషయంలోనూ కేర్ తీసుకోలేదు. ఐ నోబడీ అనే టైటిల్ ను తెలుగులో “i, ఎవరూకాదు” అని గూగుల్ ట్రాన్సలేట్ చేసేశారు.
టెక్నీషియన్ టైటిల్ కార్డ్స్ కూడా సింపుల్ గా గూగుల్ లో ట్రాన్సలేట్ చేసి కనీసం ఫాంట్స్ కూడా సరిగ్గా కనిపించకుండా, అసలు అర్థం కాకుండా సినిమాలో ప్లే చేయడం అనేది మేకర్స్ తెలుగు మార్కెట్ ను, తెలుగు ప్రేక్షకుల్ని ఎంత అలుసుగా తీసుకున్నారు అనేది స్పష్టమవుతుంది.
తెలుగులో తాను నటించే సినిమాలన్నీ విడుదల చేస్తూ, తెలుగు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ, తెలుగు మార్కెట్ మీద ఆధారపడి సినిమాలు నిర్మిస్తున్న పృథ్వీరాజ్ కూడా ఇలా చేయడం అనేది క్షమించకూడదని విషయం. ఒక రైటర్ ని పెట్టుకుని తెలుగులో ఫాంట్స్ & టైటిల్స్ సరిగా రాయించుకునే కనీస స్థాయి ఎఫర్ట్స్ పెట్టని పృథ్వీరాజ్ కు మాత్రమే కాదు.. ఇదే తీరులో ప్రవర్తించే ఏ ఒక్క పరభాషా హీరోకి, దర్శకుడికి, నిర్మాతకి తెలుగులో సినిమాని రిలీజ్ చేసి ప్రమోట్ చేసే హక్కు లేదు.




