ఇప్పటివరకు మీడియా వర్గాల్లో హల్చల్ చేసిన వార్తలకు తెరపడింది. కర్నూల్ జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు, కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కృష్ణాజిల్లా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలుగుదేశం జెండా పట్టుకోబోతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆ నాలుగు నియోజక వర్గాలలో వైసీపీ ప్రత్యర్ధిగా ఉన్నటువంటి స్థానిక టిడిపి నాయకులను కూడా పిలిపించి ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చే ఏర్పాట్లు కూడా చేసారు.
ఇదిలా ఉంటే, ఈ రోజుతో మొదలైన ఈ వలసలు మార్చి 5వ తేదీ వరకు కొనసాగుతాయని, దాదాపుగా వైసీపీ 50 శాతం వరకు ఖాళీ అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో రాబోతున్న వారం రోజుల్లో ఏపీలో రాజకీయ ప్రకంపనలు సంభవించడం ఖాయంగా కనపడుతోంది. ఒక ప్రతిపక్ష పార్టీ నేత 21 మంది అధికార పార్టీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చేసిన గాలి కబుర్లకు వీరంతా తట్టుకోలేకపోయారని, పౌరుషంతో ముందుకు వచ్చి, రాష్ట్ర శ్రేయస్సు రీత్యా టిడిపిలో చేరుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో విమర్శలకు తావు లేదని, ఏపీలో రాజకీయ పునర్వ్యవస్థీకరణ కోసం సిఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, ఇక జగన్ “లెక్క” పెట్టుకోవడమే తరువాయి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వైసీపీ వర్గాలో కలకలం సృష్టిస్తున్నాయి.



