తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి పూర్తిగా ఏడాదిన్నర కాలం కూడా గడవలేదు. మళ్ళీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా మరో నాలుగేళ్ళ సమయం కావాల్సిందే. తెలంగాణలో 2023 డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
జూన్ 2024 లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన అటు తెలంగాణలో మరో ఐదేళ్లకు అంటే 2028 న సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు ఏపీలో 2029 న తిరిగి ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టు వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం అమలు జరిగితే అసలు దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్న పూర్తి సమాచారం ఎవ్వరికి తెలియదు.
కానీ ఇటు ఏపీలో వైసీపీ, అటు తెలంగాణలో బిఆర్ఎస్ మాత్రం ఇంకో మూడేళ్ళలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు వడ్ఢితో సహా అన్ని చెల్లిస్తాం అంటూ అధికార పార్టీ నేతలను, ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం.
మొన్నీమధ్య తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ మరో మూడేళ్ళలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది, అప్పుడు ఈ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న అధికారుల బట్టలు ఊడతీస్తాం అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు బహిరంగ హెచ్చరికలు పంపారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి వైసీపీ..బిఆర్ఎస్ రెండు ఒక్కే తీరే ఆలోచిస్తాయా.? ఒక్కే తీరే రాజకీయం చేస్తాయా.? అన్న సందేహాలకు తెరలేపారు. త్వరలో నిర్వహించబోయే పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణకు గాను వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు పార్టీకి విరాళాలను అందించారు.
ఆ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ లగచర్ల భూసేకరణ సమయంలో ఆ గ్రామంలోని మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పై మండిపడ్డారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారుల పై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై విమర్శలు గుప్పించారు కేటీఆర్.
అలాగే ఈ ఘటన పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ను, జాతీయ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, కొండగల్ ఎమ్మెల్యే గా ఉన్న రేవంత్ వెంటనే ఇక్కడి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.
హై కోర్ట్ స్టే ఇచ్చిన భూముల పై భూసేకరణ చేయడం, అందుకు అధికారులు హద్దు దాటి ప్రవర్తించడం అన్ని ప్రజలు గమనిస్తున్నారని, అటువంటి అధికారుల పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే మూడేళ్ళలో మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన అధికారుల పై తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు కేటీఆర్.
అయితే ఇక్కడ మహిళల పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు పై ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కేటీఆర్ మూడేళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని బిఆర్ఎస్ ఎలా అధికారంలోకి రాగలుగుతుందో చెప్పగలదా.? అలాగే అద్దు దాటి ప్రవర్తించిన అధికారులను హెచ్చరించిన కేటీఆర్ ప్రజా తీర్పును కాదని ఎలా అధికారంలోకి రాగలరో బదులివ్వగలరా.?
ప్రజల పక్షాన పోరాడటం విపక్షాల భాద్యత, అలాగే ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల హక్కు. అంతేకాని ఇలా ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కాదని మూడేళ్ళలో మనదే ప్రభుత్వం, మనదే అధికారం అంటూ పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడం కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఈ రెండు పార్టీల నేతలకు తగదు.




