జగన్ మోహన్ రెడ్డి కి వీర విధేయులుగా నిరూపించుకోవడానికి ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడానికైనా, తమ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోవడానికైనా రెడీ అంటూ ముందుకెళ్తున్నారు కొందరు వైకాపా నాయకులు. వారిలో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే గా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ తీసుకుని నర్సారావుపేట ఎంపీ గా ప్రమోషన్ అందుకోవాలని ఆశ పడుతున్న అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.
ఆయన జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్థానిక ఇంచార్జ్ ల మార్పు ప్రక్రియలో భాగంగా కొందరు వైకాపా నాయకులు జగన్ ను వ్యతిరేతికించి బయటకు వస్తుంటే మరికొందరు అక్కడ కూడా తమ పట్టు నిలుపుకోవడానికి, పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారిని తనవైపు ఆకర్షించుకోవడానికి, అధినాయకత్వాన్ని మెప్పించడానికి తమ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ కోసం దేనికైనా సిద్ధం అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నేను జగన్ గారికి వీర విధేయుడిని, భక్తుడిని, వీర సైనికుడిని, ఆయన కోసం ఏదైనా చేస్తా, జగన్ కోసం తలతెగుతుంది ముందుకు వెళ్లి నిలబడు అన్నా కూడా నేను ఆలోచించకుండా ముందడుగు వేస్తానే కానీ వెనకడుగు వేయను అంటూ జగన్ “నీ ఒక్కడి కోసం ఎరైనా అవుతా… సొరైనా అవుతా” అన్నట్లుగా అనిల్ వ్యాఖ్యానించారు.
అలాగే జగన్ కోసం రామబంటు లా పనిచేస్తా అంటూ తన స్వామి భక్తిని చాటారు. పనిలో పనిగా జగన్ మాదిరే ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అంటూ నర్సారాపేట ప్రజలకు కూడా హామీ ఇచ్చారు అనిల్. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా ఇక్కడే నా ఇల్లు, ఇదే నా రాష్ట్ర రాజధాని అంటూ ప్రజలను నమ్మించి గెలిచిన తరువాత అదే రాజధాని ప్రాంతాన్ని సమాధితో పోల్చారు ముఖ్యమంత్రి జగన్.
ఇప్పుడు అనిల్ కూడా అదే తరహాలో గెలిచిన తరువాత నేను ఇక్కడే స్థానికంగా ఇల్లు కట్టుకుంటా., ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అంటూ ఇస్తున్న హామీలతో ఈ ప్రాంతం కూడా మరో అమరావతి కానుందా..? అనే అనుమానాలు స్థానికులలో మొదలయ్యాయి. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో కూడా ఆర్కే ఇదేతరహా వ్యాఖ్యలు చేసి ఆ ప్రాంత ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు చేతులు కడుక్కున్నారు.
ఇటువంటి రాజకీయ నాయకులు తమ అధిష్టానాన్ని మెప్పించడానికి ఎరా…సొరా…అంటూ కబుర్లు చెప్పి చివరికి తమను నమ్మి ఓటేసిన ప్రజలను ప్రభుత్వానికి ఎరగా వేసి పదవులు సాధించుకుని తమ ప్రాంతాన్నే సొర లా చేసుకుని తినేస్తారు అనేది ఇప్పటికే నిరూపించబడింది. కాబట్టి ఇటువంటి మాయమాటలకు లొంగితే “మీరు ఎర అవ్వాల్సిందే…మీ ప్రాంతం సొర అవ్వాల్సిందే” అనేది గ్రహించాలి. ప్రజల ఓట్లకోసం ఇటువంటు హామీలను ఎర వేయడం రాజకీయ నాయకులకు పరిపాటే అనేది గుర్తించుకోవాలి.




