ఏదైనా ఓ రాజకీయ పార్టీలో ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో కాస్త తేడాగా మాట్లాడేవారు కనిపిస్తుంటారు. కానీ వైసీపీలో పైనుంచి కార్యకర్త స్థాయి వరకు అందరి ప్రవర్తన, నోటి దురుసు ఒక్కలాగే ఉంటుంది. కులం లేదా మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీలలో సైతం పై నుంచి కింద వరకు ఇలాంటి ఒకే రకమైన మనస్తత్వం కనిపించదు.
గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించడం, అదీ… ‘పిల్ల బచ్చా’ భరత్ చేతిలో ఓడిపోయేలా చేయడం ద్వారా అయన రాజకీయ జీవితాన్ని, దాంతో పాటు టీడీపిని భూస్థాపితం చేద్దామని జగన్ పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఆ ప్లాన్ ఫలించలేదు. ఆ స్టోరీ అందరికీ తెలుసు. కనుక ఇప్పుడా చర్చ వద్దు.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ మళ్ళీ రెండేళ్ళ తర్వాత నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అనుచరులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన అభ్యర్ధులను టీడీపి నేతలు బెదిరించి నామినేషన్స్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తారు. లేదా అసలు నామినేషన్స్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కనుక మనం అందరం కలిసికట్టుగా నిలబడి పోరాడి ఈ ఎన్నికలలో గెలవాలి. అవసరమైతే ఈ ఎన్నికలలో మనం చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉండాలి తప్ప ఎవరూ వెనక్కు తగ్గకూడదు,” అని చెప్పారు.
వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతాం’ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే వారించాల్సిన జగన్, వారిని వెనకేసుకు వచ్చారు. అంటే అది తప్పు కాదని భావిస్తున్నారన్న మాట.
కనుక వైసీపీలో భరత్ వంటి నాయకులు ఇప్పుడు ఇలా మాట్లాడటం పెద్ద విచిత్రం కాదు. కానీ ఏపీ రాజకీయాలలోకి కత్తులు, గొడ్డళ్ళు, చంపడాలు, నరకడాలు వంటి ఫ్యాక్షన్ పోకడలు ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలే సామాన్య ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ భయంతో నే ప్రజలు తమకు ఓట్లేసి మళ్ళీ అధికారం కట్టబెడతారని వైసీపీ భావిస్తున్నట్లుంది. కానీ ఆ భయంతోనే ఈసారి ఆ 11 సీట్లు దక్కకుండా చేసే ప్రమాదం కూడా ఉంది.





