తేల్చేశారు… అల్లర్లకు కూడా చంద్రబాబే కారణమట!

palnadu-violence

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయంలో వైసీపి మూకలు పెట్రేగిపోతుండటంతో ఈసీ డిజిపితో సహా పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసింది. వైసీపి మూకలు టిడిపి నేతలు, కార్యకర్తలు, వారి కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఈసీ సైతం తప్పు పట్టింది.

ADVERTISEMENT

వినీత్ బ్రిజ్ లాల్ అధ్వర్యంలో సిట్ బృందం కూడా రెండు రోజులు విచారణ జరిపి తమ నివేదికని డిజిపి హరీష్ కుమార్‌ గుప్తాకు అందజేశారు. దానిలో కూడా అల్లర్లు జరిగిన జిల్లాలలో పోలీస్ అధికారులు శాంతిభద్రతలు కాపాడటంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.

అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఊహించిన్నట్లే ఏపీలో వైసీపి మూకలు రెచ్చిపోయాయని, వైసీపి నేతల కనుసన్నలలో పనిచేసే పోలీస్ అధికారులు టిడిపిపై దాడులు జరుగుతున్నా ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యాయని స్పష్టం అవుతోంది.

అయితే వైసీపి ఆత్మసాక్షి దీనినే తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ ఈరోజు ఆన్‌లైన్‌లో పత్రికలో ‘బదిలీలతో బరితెగింపు’ శీర్షికతో ఓ కధనం వండి వార్చింది.

దాని ప్రకారం ‘ఈ అల్లర్లకు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిలు చేసిన కుట్రలే కారణం. వారిరువురూ ఈసీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో 38 మంది పోలీస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పించి, తమకు కావలిసిన వారిని నియమించుకున్నారు.

ఎక్కడెక్కడైతే అధికారులను తప్పించారో అక్కడే అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతాలలో పోలీస్ అధికారులు టిడిపి నేతలతో కుమ్మక్కు అవడంతో టిడిపి మూకలు అల్లర్లకు, వైసీపి శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా ఉండిపోయారు.

వైసీపిని ఎన్నికలలో ఎదుర్కొని గెలవలేమనే భయంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల కమీషన్‌పై ఒత్తిడి చేసి పోలింగ్‌ సమయంలో, ఆ తర్వాత కూడా అల్లర్లు జరిపించారు’ అని దాని సారాంశం.

సొంత మీడియా చేతిలో ఉంటే వాస్తవాలను, కళ్లెదుట జరిగుతున్న పరిణామాలను ఎంత చక్కగా వక్రీకరించి చెప్పవచ్చనేదానికి ఇదే ఓ చక్కటి ఉదాహరణ.

వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సంక్షేమ పధకాలు, ఐప్యాక్, విధేయులైన పోలీస్ అధికారులతో ఈసారి ఎన్నికలలో అవలీలగా గెలిచేయవచ్చని జగన్మోహన్‌ రెడ్డి భావించారు. అందుకే 175/25 సీట్లు మాకే వస్తాయని పదేపదే చెప్పుకున్నారని అనుకోవచ్చు.

కానీ టిడిపి, జనసేనలు, ఆ తర్వాత టిడిపి, బీజేపీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేయడానికి సిద్దమవడంతో జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపిలో అందరూ ఎంతగా ఆక్రోశించారో, ఎందుకు ఆక్రోశించారో అందరికీ తెలుసు.

ఎన్నికలు దగ్గర పడేసరికి అనూహ్యంగా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో, జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా ‘చొక్కా మడత పెట్టి యుద్ధానికి సిద్దంకండని’ వైసీపి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపిలో ఇంకా ఎవరైనా ఆ పిలుపు విని ఉండకపోతే బహుశః వారికీ తెలిసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ‘సిద్దం’ పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టించారు.

కనుక యుద్ధ ప్రకటన చేసి ఈ యుద్ధం జరిపించింది కూడా ఆయనే అని స్పష్టం అవుతుంటే, ‘బదిలీల బరితెగింపు’ అంటూ కధనాలు వండి వార్చుతుండటం సిగ్గుచేటు కదా? అయినా రాష్ట్రంలో ఏ అవాంఛనీయ ఘటన జరిగినా చివరికి వర్షాలు పడకపోయినా చంద్రబాబు నాయుడినే నిందించడం వైసీపి నేతలకు పరిపతిగా మారిపోయింది.

ఆనాడు ప్రహ్లాదుడు శ్రీహరిని భక్తితో పూజిస్తే, హిరణ్యకశిపుడు ద్వేషంతో నిత్యం శ్రీహరి నామస్మరణ చేశాడు. కానీ భక్తితో పూజించిన ప్రహ్లాదుడు కంటే ముందు హిరణ్యకశిపుడికే శ్రీహరి నరసింహావతారంలో దర్శనమిచ్చి మోక్షప్రాప్తి కల్పించాడు.

జగన్‌, వైసీపి నేతలూ కూడా అలాగే 5 ఏళ్ళుగా చంద్రబాబుని ద్వేషిస్తూ ఆయన నామస్మరణ చేశారు… ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. కనుక త్వరలోనే వారందరికీ, వారి నుంచి రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు విముక్తి ప్రసాదించబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories