దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎలాగైనా వీలైనంత ఎక్కువకాలం జైలులోనే ఉంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలులో ఉన్న ఆయనకు బెయిల్ దొరికి బయటకు రాకుండా వరుసగా వేరువేరు కేసులలో రిమాండ్ కు పంపిస్తున్నారు. ఇలా ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో లోపలే ఉండేలా చెయ్యడం ప్రభుత్వం వ్యూహం.
ఇప్పటివరకు యాభైకు పైగా కేసులు తెరమీదకు తెచ్చారు. తాజాగా 2011లోని కోడి పందాల కేసును తెరమీదకు తెచ్చారు. అందులో భాగంగా బుధవారం చింతమనేనిని ఏలూరు సబ్ జైలు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టులో హజరుపరిచారు. చింతమనేనిపై 2011లో యానిమల్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది.
సహజంగా ఇటువంటి కేసులు షరామామూలే. ప్రతి సంవత్సరం కోడి పందాలపై కేసులు పెట్టడం, వాటిని అనధికారికంగా అనుమతించడం మాములే. కోడి పందాల నిర్వహణాలలో అన్ని పార్టీ నేతలు ఉంటారు. వచ్చే సంక్రాంతికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలోనే అవి జరుగుతాయి. అయితే చింతమనేని మాత్రమే కోర్టు వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియంది కాదు.
చింతమనేని జైలు నుండి విడుదల అయ్యే సమయానికి నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంగా కనిపిస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో 13,311 ఓట్ల భారీ తేడాతో ఆయన మీద వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అబ్బాయి చౌదరి గెలుపొందారు. టీడీపీ కూడా అధికారంలో లేకపోవడంతో చింతమనేనికి ఇబ్బందులు తప్పడం లేదు.



