కాకినాడలో దళిత యువకుడి హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయ్ భాస్కర్) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పటికి రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో మళ్ళీ మూడో ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడూ బెయిల్ లభించకపోవచ్చు. కనుక అనంతబాబును బయటకి తీసుకురావడానికి కాకినాడ పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లున్నారని బాధిత కుటుంబం తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేసారు.
చట్ట ప్రకారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసి ఉంటుంది. అనంతబాబుని అరెస్ట్ చేసి నేటితో 89 రోజులు పూర్తయ్యాయి. మరొక్క రోజు ఆలస్యం చేస్తే ఆటోమేటిక్‌గా అనంతబాబుకి బెయిల్ వచ్చేస్తుంది. కానీ తాము ఒత్తిడి చేస్తే తప్ప ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని అన్నారు. అనంత బాబుకు బెయిల్ వచ్చేందుకే పోలీసులు ఛార్జ్ షీట్ వేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
కనుక ఆయన దళిత, ప్రజా సంఘాలతో కలిసి కాకినాడలో ధర్నాలు చేసి పోలీసులపై ఒత్తిడి పెంచారు. వారి ఒత్తిడి భరించలేక ఎట్టకేలకు పోలీసులు నిన్న అంటే గడువు ముగియానికి రెండు రోజుల ముందు రాజమండ్రిలో ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
అయితే అనంతబాబుకి ఎలాగైనా జైలు నుంచి విముక్తి కల్పించాలని పోలీసులు అనుకొంటే దానిని ఎవరూ ఆపలేరని ముప్పాళ్ళ సుబ్బారావు అభిప్రాయం వ్యక్తం చేసారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్‌లో ఒక్క తప్పు ఉన్నా దానిని న్యాయమూర్తి తిరస్కరించే అవకాశం ఉందని, అప్పుడు అనంత బాబుకి ఆటోమేటిక్‌గా బెయిల్ వచ్చేస్తుందని తెలిపారు. కనుక పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను న్యాయమూర్తి అంగీకరిస్తేనే పోలీసుల చిత్తశుద్ధి బయటపడుతుందని అన్నారు. ఆ ఛార్జ్ షీట్‌ని న్యాయమూర్తి శనివారం పరిశీలించే అవకాశం ఉంది.