సరిగ్గా ఏడాది క్రితం అంటే మే 13, 2024 న ఆంధ్రప్రదేశ్ లో ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ‘వై నాట్ 175’ అంటూ వైసీపీ, ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అంటూ టీడీపీ, ‘హలో ఏపీ బై బై వైసీపీ’ అంటూ జనసేన హోరాహోరీ ఎన్నికల ప్రచారాలు చేసాయి.
అయితే 2019 నుంచి 2024 ఎన్నికల వరకు నాటి ప్రభుత్వం వైసీపీ అవలంభించిన నియంత పాలనకు విసిగిపోయిన టీడీపీ, జనసేన, బీజేపీ ని కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసారు. అయితే అటు కూటమి నేతలు కూడా ఆశ్చర్యపడేలా, వైసీపీ శ్రేణులు సైతం ఊహించలేని విధంగా ఏపీలో పోలింగ్ నడిచింది.
ఎన్నడూ లేని విధంగా ఇతర దేశాల నుండి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు ఏపీకి తరలి వచ్చారు. బాబు అరెస్టు, పవన్ నిర్బంధాలతో ఆయా పార్టీల శ్రేణులతో పాటుగా సాధరణ ప్రజానీకం కూడా వైసీపీ దుస్సాహసాలకు బదులు చెప్పాలని భావించారు.
చంద్రబాబు నేతృత్వంలో కూటమి 175 స్థానాలలో పోటీ చేయగా అందులో 164 స్థానాలను గెలుచుకుని 93 % స్ట్రైక్ రేట్ తో ఆంధ్రపద్రేశ్ చరిత్ర చూడని విజయాన్ని కూటమి సొంతం చేసుకుంది. అలాగే వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
దీనితో కేవలం బటన్లు నొక్కి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే చాలు ఇక రాబోయే 30 ఏళ్ళు మనదే అధికారం అనుకున్న నాటి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆలోచనలను పటాపంచలు చేస్తూ, అలాగే నాటి వైసీపీ నాయకుల ఉన్మాద చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ని పాతాళంలోకి తొక్కారు.
అలాగే రాష్ట్ర పరువుకి ఇక్కడి ప్రజల గుర్తింపుకి నాందిగా చెప్పబడే రాజధాని అమరావతిని అరణ్యంగా మార్చి వైసీపీ ఆడిన మూడు ముక్కలాటకు ఏపీ ప్రజలు మూడు రంగుల వైసీపీ జెండాను మూడు ప్రాంతాలలోను అటు విశాఖ, ఇటు అమరావతి, ఇక కర్నూల్ లో సైతం నామరూపాలు లేకుండా ఓడించారు.
ఐదేళ్ల వైసీపీ అన్యాయాలను, అరాచకాలను, విధ్వంసాలను మౌనంగా చూస్తూ సమయం కోసం వేచి చూసిన ప్రజలు మే 13 2024 న తమ ఓటుతో వైసీపీ నోటికి సమాధానం చెప్పారు. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలలో 135 స్థానాలలో విజయ సాధించింది.
అలాగే జనసేన పోటీ చేసిన 21 కి 21 నెగ్గి 100 % స్ట్రైక్ రేట్ తో దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు ను సొంత చేసుకుంది. ఇక బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలకు గాను 8 చోట్ల విజయ కేతనం ఎగరేశారు. ఈ తరహా విజయాన్ని కానీ, ఈ తరహా పోలింగ్ విధానాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ఇతివరకెప్పుడు చూడలేదు. ఇది ఒక చరిత్రనే చెప్పాలి.
“హలో ఏపీ..వై నాట్..సైకో పోవాలి” అనే ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పారు. దీనితో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకే కాదు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ కి కూడా మే,13,2024 ఎన్నటికీ మరిచిపోలేని రోజనే చెప్పాలి.




