బహుశః మన దేశం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భౌగోళికంగా చాలా పెద్దదని జగన్ అనుకున్నారో ఏమో… ఏపీకి ఒక్క రాజధాని సరిపోదు మూడు ఉండాలన్నారు. వైసీపిలో అందరూ కలిసి రెండేళ్ళు ఆ పాట పడిన తర్వాత, ‘గూడంటే గూడూ కాదూ… మూడంటే మూడూ కాదు… విశాఖ ఒక్కటే రాజధాని…’ అంటూ మరో కొత్త పాట అందుకుని ఓ ఏడాదిపాటు ఏకధాటిగా ఆలపించారు. కానీ అదీ చేయలేక ఋషికొండపై ఓ బిల్డింగ్ కట్టి ‘అదిగో అల్లదిగో జగనన్న వాసమూ….’ అంటూ పాట పాడారు. దాని కోసం వందల కోట్లు ఖర్చుపెట్టేశారు కానీ జగన్ ఆ ఇంట్లో దిగే సాహసం చేయలేకపోయారు!
కనుక నేటికీ గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు కట్టించిన సచివాలయం, శాసనసభలో నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.
సరే! ఎలాగూ మరో రెండు మూడు నెలల్లో వైసీపి ప్రభుత్వం గడువు దానితో పాటు రాజధాని కధలు కూడా సమాప్తం అయిపోతున్నాయి కదా అని అనుకుంటుంటే, వైసీపిలో రెండో లేదా మూడో నెంబర్‌లో ఉన్న సీనియర్ నాయకుడు, వైవీ సుబ్బారెడ్డి మరో బాంబు పేల్చారు.
“మనకు రాజధాని కట్టుకునే స్థోమత లేదు కనుక అన్ని విధాలా అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా చేద్దామని చాలా చిత్తశుద్ధితో ప్రయత్నించాము. కానీ దానికీ న్యాయపరమైన అడ్డంకులు కల్పించడంతో అదీ సాధ్యపడలేదు. విశాఖ రాజధాని అయిపోయి ఉంటే మనకు ఈ సమస్య ఉండేదే కాదు. కానీ ఈ చిక్కుల వలన విశాఖ ఇంకా ఎప్పటికీ రాజధాని అవుతుందో మనకి తెలీదు.
కనుక మన రాజధాని సిద్దమయ్యేవరకు హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము. ఎన్నికల తర్వాత దీని గురించి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాము,” అని అన్నారు.
అమరావతి కంటే చాలా తక్కువ ఖర్చుతో జస్ట్ ఓ 5-10,000 కోట్లతో విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కనిపెట్టి చెప్పింది జగన్మోహన్ రెడ్డే. ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు అది కూడా ఎప్పుడు సాధ్యపడుతుందో తెలీదు… కనుక మళ్ళీ హైదరాబాద్‌ని రాజధానిగా చేయాలని కేంద్రాన్ని అడుగుతామని వైవీ సుబ్బారెడ్డి చేత చెప్పించడం సిగ్గుచేటు!
ఈ మాట వింటే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వం, అక్కడి నాయకులు, ప్రజలు కూడా నవ్వుతారు. ఈ ప్రతిపాదన వింటే వాళ్ళే కాదు… ఏపీలో కూడా అందరూ నవ్వుతారని వైసీపి నేతలకు తెలియదనుకోలేము.
కనుక ఇదేదో వైవీ యాదృచ్ఛికంగా అన్న మాట కానే కాదు. బహుశః ఇది కూడా త్వరలో జరుగబోయే ఎన్నికల కోసం సిద్దం చేసిన మరో సరికొత్త వ్యూహమే కావచ్చు. లేదా విశాఖ రాజధాని గురించి కూడా ప్రజలకు చెప్పుకోలేని దుస్తితిలో ఉన్నారు కనుక ప్రజలకు ఏదో ఒకటి చెప్పుకోవాలి కనుక ఈ కొత్త పాట ‘సిద్దం’ చేసి ఉండొచ్చు.
కానీ రేపు వైసీపిలో అందరూ కోరస్ పాడటం మొదలుపెడితే ఏమవుతుంది?అంటే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్లు రాజుకుంటాయి. రాజుకుంటే ఐదేళ్ళ వైసీపి వైఫల్యాలపై నుంచి ప్రజల దృష్టి దీనిపైకి మళ్ళించవచ్చని భావించి ఈ ‘వ్యూహం’ ‘సిద్ధం’ చేస్తున్నారేమో?ఏమో?
మనకు రాజధాని కట్టుకునే స్తోమత లేదు… హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతాం
– వైవీ సుబ్బారెడ్డి
తమ వల్ల కాదు అని చెప్పడానికి ఏ రాజకీయ పార్టీ అయినా సిగ్గు పడుతుంది కాకపోతే వైసీపీ వాళ్ళే అది కూడా ఘనతగా చెప్పుకో గలరు#NoCaptialAndhraPradesh pic.twitter.com/EPlRPKlLId
— M9 NEWS (@M9News_) February 13, 2024




