నేడు తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ వివేకాకు వివాహేతర సంబంధాల గురించి అందరికీ తెలిస్తే కుటుంబం పరువుపోతుందనే ఇంతకాలం బయటపెట్టలేదు. కానీ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతున్నందునే ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటపెట్టక తప్పలేదు. ఈ హత్య కేసులో సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ప్రమేయం గురించి కూడా సీబీఐ దర్యాప్తు చేసి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు లేదు. ఈ కేసులో చట్టం తన పని చేసుకుపోతుంది,” అని అన్నారు.
వివేకానందరెడ్డికి మొదట గుండెపోటు వచ్చి, రక్తం కక్కుకొని చనిపోయారని చెప్పింది వైసీపీ నేతలే. తర్వాత అది సహజమరణం కాదు హత్య అని చెప్పింది వైసీపీ నేతలే. ఆ హత్యను చేయించింది చంద్రబాబు నాయుడని చెప్పింది వైసీపీ నేతలే. కానీ ఆ తర్వాత ఆస్తిగొడవల కారణంగా హత్య చేయబడ్డారని, వివాహేతర సంబంధాల కారణంగా హత్య చేయబడ్డారని వాదిస్తున్నారు.
వివేకాని ఎవరు ఎందుకు హత్య చేశారనేది కోర్టు, సీబీఐ తేలుస్తాయి. కానీ గత ఎన్నికలలో వివేక హత్య గురించి చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందింది వైసీపీయే కదా? బహుశః అప్పుడు వివేకా హత్య సానుభూతి ఓట్లు కావాలి కనుక ఆయన వివాహేతర సంబంధాల గురించి చెప్పలేదనుకోవచ్చు కదా? కానీ వైఎస్ కుటుంబం పరువుపోతుందనే అప్పుడు చెప్పలేదంటున్నారు. అప్పుడు వైఎస్ కుటుంబం కాపాడాలనుకొన్నవారే ఇప్పుడు ఎందుకు పరువు తీస్తున్నారు?
ఈ కేసులో బాధితురాలుగా ఉన్న జగన్ చిన్నాన్న కూతురు సునీతారెడ్డి కుటుంబం పరువు కూడా తీస్తున్నారు కదా?చివరికి నాలుగేళ్ళ క్రితం చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ ఘోషించేలా ఆయన పరువురు కూడా తీస్తున్నారు కదా?ఇవన్నీ ఒక్క అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసమేనా? లేక ఇంకెవరినైనా కాపాడేందుకా?



