ఏదైనా ఒక సినిమా విడుదలయ్యింది అంటే ప్రస్తుతం అందరి చూపులు మొదటగా వెళ్తున్నది రివ్యూలపైనే. ఇందులో వెబ్ మీడియా కీలకపాత్ర పోషిస్తుండగా, ఇటీవల కాలంలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ రివ్యూ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎంతో విమర్శనాత్మక దృష్టితో చూసే సదరు మీడియా ఛానల్ ఇప్పటివరకు ఇచ్చిన రేటింగ్స్ ను పరిశీలిస్తే… 3 అంకెను దాటి ఏ సినిమా కూడా వెళ్ళలేదు. విమర్శకుల ప్రశంసలు పొందిన “1 నేనొక్కడినే” వంటి సినిమాలకు కూడా 2 రేటింగ్స్ ను ఇచ్చిన సదరు మీడియా ఛానల్ చరిత్రను “శాతకర్ణి” తిరగరాసాడు.
బాలకృష్ణ అభినయాన్ని ప్రశంసిస్తూ, క్రిష్ దర్శకత్వ ప్రతిభను కొనియాడుతూ సాగిన ఈ రివ్యూలో ఏకంగా 4 రేటింగ్ ఇచ్చి ప్రేక్షకులను అవాక్కు చేసారు. నిజానికి ఇంత స్థాయిలో సదరు మీడియా ఛానల్ మునుపెన్నడూ ఇవ్వకపోవడంతో ఒక విధంగా ప్రేక్షకులే ఆశ్చర్యపడ్డారు. కానీ, ప్రతి తెలుగు వాడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ, తెలుగు జాతి సగర్వంగా చాటిచెప్పుకునే సినిమా అంటూ అభినందనలు కురిపిస్తూ మరీ ఈ ‘4/5’ రేటింగ్స్ తో “గౌతమీపుత్ర శాతకర్ణి”కి పట్టాభిషేకం చేసారు. అయితే అప్పటికే ‘ది హిందూ’ వంటి ప్రముఖ పత్రికలు ఈ సినిమాకు ‘4/5’ రేటింగ్స్ తో స్వాగతం పలకడంతో ఫలితం డిక్లేర్ అయిపోయింది.



