కొన్ని మీడియా వర్గాల నుండి వస్తున్న సమాచారం మేరకు తెలంగాణ కాంగ్రెస్ భారీ కుదుపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో మెజార్టీ పార్టీ మారితే ,కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. పైగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. వీరితో రాజీనామా చేయించకుండా లెజిస్లేటివ్ పార్టీని తెరాసలో విలీనం చేయించే అవకాశం ఉందట.
[m9ad]
గతంలో టీడీపీపై కూడా ఇదే అస్త్రాన్ని వాడారు కేసీఆర్. మంత్రివర్గ విస్తరణ కేవలం కొద్ది మందికే పరిమితం చేసి ఆ తర్వాత ఈ పిరాయింపులు, లోక సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేయవచ్చని తెరాస వర్గాలు భావిస్తున్నాయని సమాచారం వచ్చింది. నిజంగా ఇంత మంది తెరాసలో చేరిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకపోతే అది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఐదు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది.
ఇప్పటికే ఇండిపెండెంట్లను తెరాస వైపుకు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా రాష్ట్రంలోని 17 సీట్లలో 16 కొట్టి జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారు. మరొక సీటు ఎలాగూ మిత్రపక్షమైన ఎంఐఎం కంచుకోటగా ఉంది. ఆ సీటులో స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిరాశకు గురయ్యింది. ఈ దెబ్బ కూడా తగిలితే ఆ పార్టీ కోలుకోవడం కష్టమే.
ఇప్పటికి ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కూడా చెయ్యలేదు. అప్పుడే ఫిరాయింపులు అంటే ఆక్షేపణీయమే. ప్రజల తీర్పును అపహాస్యం చెయ్యడమే. అదే సమయంలో నిజంగానే కాంగ్రెస్ నుంచి అంత మంది తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వస్తారా? లేక ఇది అధికార పక్షం ఆడుతున్న మైండ్ గేమా అన్నది చూడాలి. ఎక్కువ మంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ సారి కాంగ్రెస్ ఎక్కువగా అనుభవం తక్కువ ఉన్న వారే ఉన్నారు. దీనివల్ల వారు ప్రలోభాలకు గురి చెయ్యడం తేలికా?



