స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో పేరు తెచ్చిన పధకం ఆరోగ్యశ్రీ. దాంతో నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే క్రమంగా ఇది ఎన్నికలలో ఓట్లు కురిపించే పధకంగా మారిపోయింది.
అందుకే అన్ని పార్టీలు పోటాపోటీగా ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని పెంచేస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వైసీపి ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయ్యి ఈ పధకం పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచేసింది.
అయితే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తోందా? అంటే లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) లిఖితపూర్వకంగా చెపుతోంది. గత 45 రోజుల బకాయిలు కాకుండా వైసీపి ప్రభుత్వం రూ.1,000 కోట్లు బకాయిలు ఉందని, కనుక తక్షణమే బకాయిలు చెల్లుయించాలని కోరుతూ నవంబర్‌లోనే ‘ఆశా’ ఓ లేఖ వ్రాసింది.
అయితే బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వాటిని ప్రలోభపెట్టడంగానే భావించవచ్చు. నవంబర్ నెలాఖరులోగా వెయ్యి కోట్లు బకాయిలు చెల్లించాలని లేఖ వ్రాయగా, డిసెంబర్ నెలాఖరవుతున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నెల 22న ‘ఆశా’ మళ్ళీ బకాయిల గురించి గుర్తు చేస్తూ వైసీపి ప్రభుత్వానికి మరో లేఖ వ్రాసింది.
దానికీ స్పందన లేకపోవడంతో డిసెంబర్ 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయబోతున్నట్లు నేడు (మంగళవారం) ఆశా ప్రతినిధులు ప్రకటించారు.
కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణ చాలా భారంగా మారగా, ఇప్పుడు ఈ బకాయిల భారాన్ని కూడా మోయలేమని ఆశా ప్రతినిధులు చెప్పారు. ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచాలని కోరుతున్నప్పటికీ వైసీపి ప్రభుత్వం పట్టించుకోకపోగా వెయ్యి కోట్లు తమకు బాకీ పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచడంతో తమపై భారం ఇంకా పెరిగిపోయిందని, కనుక ప్రస్తుతం ఉన్న బకాయిలను చెల్లించి, ఇక ముందు ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తుంటే తప్ప ఆరోగ్యశ్రీ పధకం క్రింద వైద్య సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు చెప్పారు.
ఆరోగ్యశ్రీ పధకం గురించి ప్రచారం కోసం వైసీపి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటుంది. అది ఓట్ల కోసమే కనుక ఆరోగ్యశ్రీ పధకం పేరుతో ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. ఆరోగ్యశ్రీ పధకానికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా సదరు ఆస్పత్రుల నుంచి సంబందిత మంత్రులకు తృణమో పణమో బహుశః ముడుతుండవచ్చు. అయినప్పటికీ ఆరోగ్యశ్రీ పధకంతో నిరుపేద రోగులు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పొందగలుగుతున్నారు కనుక ఈ పధకాన్ని తప్పు పట్టలేము.
కానీ అందరికీ మేలు చేస్తున్న ఆరోగ్యశ్రీ చివరికి ఈవిదంగా అనారోగ్యానికి గురై నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైసీపి ప్రభుత్వానిది అయినప్పుడు ఈ డెబిట్, క్రెడిట్ కూడా దానిదే కదా?




