చంద్రబాబు అధికారంలో ఉన్న రోజులలో కోర్టుల రకరకాల కేసులు వేసి అప్పటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వారు మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. జగన్ కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్న ఆయన అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి అదే పంథాని అనుసరిస్తున్నట్టు ఉన్నారు.
అయితే ఈ సారి మాత్రం అది బెడిసికొట్టింది. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయాన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారని ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. టీడీపీ ఆఫీస్‌కు ఇచ్చిన లీజ్‌ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. భూ కేటాయింపు జీఓ 228ను రద్దు చేయాలని పిటిషన్‌లో ఆర్కే పేర్కొన్నారు.
పిల్ వేయడంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గతంలోనే ఈ విషయంగా ఇదే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు కావడంతో దీనిని అనుమతించలేమని కోర్టు కొట్టిపడేసింది.
గతంలో ఆర్కే నారా లోకేష్ మీద పోటీ చేసిన సందర్భంగా జగన్ ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తా అని మంగళగిరి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే మొదటి మంత్రివర్గ విస్తరణలో జరగలేదు. ఇటీవలే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేసినా ఆర్కేకు మరో సారి జగన్ మొండి చెయ్యి చూపించారు.





