గోడకు కొట్టిన బంతిలా ఆళ్ళ రామకృష్ణ… మళ్ళీ వైసీపిలోకి!

Alla Ramakrishna Reddy

రెండు నెలల క్రితమే వైసీపికి రాజీనామా చేసి ఏపీ కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మళ్ళీ నేడు జగన్‌ సమక్షంలో వైసీపిలో చేరిపోయారు. వైసీపి ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి ప్యాలస్‌ చేరుకోగా జగన్‌ ఆయనకు కండువా కప్పి మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు.

ADVERTISEMENT

మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు జగన్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించి గంజి చిరంజీవికి టికెట్‌ ఖరారు చేయడంతో, ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పార్టీని వీడారు.

వైఎస్ షర్మిల ఏపీకి రాబోతున్నప్పుడు, ‘ఆమె వెంట నడుస్తానని’ రాష్ట్రంలో మొట్ట మొదట ప్రకటించిన వ్యక్తి ఆళ్ళ. కానీ నెలరోజులు కూడా కాక మునుపే చెల్లికి గుడ్ బై చెప్పేసి, మళ్ళీ అన్న చెయ్యి అందుకున్నారు ఆళ్ళ.

ఇది ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీలో మొదటి ఎదురు దెబ్బగా భావించవచ్చు. తనను చూసి వైసీపి నుంచి చాలా మంది సీనియర్ నేతలు ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తారనుకుంటే, వచ్చిన ఒక్క వ్యక్తి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళిపోవడంతో ఆమె ఇమేజ్‌ దెబ్బ తింటుంది.

ఆయన గోడకు కొట్టిన బంతిలా వైసీపిలోకి తిరిగి వచ్చేయడంతో జగన్‌, వైసీపి నేతలు గొప్పగా చెప్పుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆళ్ళ రామకృష్ణ రెడ్డికి మంగళగిరి టికెట్‌ ఇవ్వకపోవచ్చు.

అక్కడి నుంచి టిడిపి యువనేత నారా లోకేష్‌ మళ్ళీ పోటీ చేస్తున్నారు. కనుక వైసీపికి ఓడిపోబోయే ఆ సీటుని జగన్‌ మళ్ళీ ఆళ్ళకు ఇచ్చినా ఆయన తీసుకోకపోవచ్చు. మరి ఆళ్ళకు జగన్‌ ఏమి ఆఫర్ ఇచ్చి తిరిగి పార్టీలోకి రప్పించుకున్నారో త్వరలోనే తెలియవచ్చు. రెండు నెలల క్రితం పార్టీని వీడుతున్నప్పుడు, జగన్‌ పెద్ద అవినీతిపరుడు, ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతగా విమర్శించిన జగన్‌ పంచనే ఇప్పుడు చేరారు. మంగళగిరిలో వైసీపి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు ఆళ్ళ సహకారం చాలా అవసరమని గ్రహించడంతో జగన్‌ కూడా ఆళ్ళ ఆరోపణలని పట్టించుకోలేదు.

ADVERTISEMENT
Latest Stories