రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు కాంగ్రెస్‌ కొంపముంచబోతున్నాయా?

Congress Leaders Protestతెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్‌ దొరకని అసమ్మతి నేతలందరూ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని టార్గెట్ చేస్తున్న తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ కార్యదర్శి కురువ విజయ్‌ దేవరకొండ కుమార్‌ అనుచరులను వెంటబెట్టుకొని హైదరాబాద్‌లో గన్ పార్క్ వద్ద ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు.”నాడు ఓటుకి నోటు… నేడు సీటుకి నోటు…” అంటూ రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రేవంత్‌ రెడ్డి 65 సీట్లను రూ.600 కోట్లకు అమ్ముకొన్నాడు. గజ్వేల్ టికెట్‌కి రూ.10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమిని కూడా తీసుకొన్నాడు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని కాపాడుతాడని మా అధిష్టానం భావిస్తే, అయినకాడికి పార్టీని అమ్మేస్తున్నాడు,” అని ఆరోపించారు.

ADVERTISEMENT

టికెట్‌ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శి పూడూరి జితేందర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇంకా పలువురు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఊహించని ఈ పరిణామం బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు కలిసివస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత ఎన్నికల రేసులో బీజేపీ వెనుకబడిపోగా ఆ స్థానంలోకి కాంగ్రెస్‌ దూసుకురావడంతో బిఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది.

ఇటువంటి సమయంలో కాంగ్రెస్‌ నేతలే రేవంత్‌ రెడ్డి టికెట్లు అమ్ముకొన్నారంటూ ఆరోపణలు చేస్తుండటం, పైగా ఓటుకి నోటు కేసుని వారే ప్రస్తావిస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బలమైన ఆయుధం లభించింది. దీంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రేవంత్‌ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఎదురుదాడి మొదలుపెట్టారు.

బండి సంజయ్‌ని మార్చిన తర్వాత మూడో స్థానంలోకి దిగిపోయిన బీజేపీకి కూడా కాంగ్రెస్‌లో చెలరేగుతున్న ఈ చిచ్చు వరంగా లభించింది. కనుక రెండు పార్టీలు దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయమే.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా పుంజుకొందని పార్టీలో అందరూ సంతోషపడుతుంటే,ఇప్పుడు సొంత పార్టీ నేతలే రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలతో కధ మళ్ళీ మొదటికి వచ్చిన్నట్లయింది.

గత ఎన్నికలలో ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, ఆయన కూడా టికెట్స్ అమ్ముకొన్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. రేవంత్‌ రెడ్డి ఓటుకి నోటు కేసులో ఇరుకొని ఉన్నందున, కాంగ్రెస్‌ నేతలే చేస్తున్న ఈ ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటోంది.

రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలకు బాగానే చేరుతుంటాయి కనుక ఇది కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా బయటపడుతుందో? అసలు బయట పడగలదో లేదో?

ADVERTISEMENT
Latest Stories