పొత్తు జనసేనకు ప్లస్ ఆ…మైనస్ ఆ ….?

JanaSena Party

ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ ఉంటుందా లేదా అనే దాని మీద ఉన్నఅనుమానాలను నివృత్తి చేసుకున్న ఈ తరుణంలో పొత్తు వలన జనసేనకు పవన్ చెపుతున్నట్టు ప్లస్ ఆ…వైసీపీ చెపుతున్నట్టు మైనస్ ఆ…అనేది చూద్దాం. పొత్తు వలన ఏ పార్టీకైనా ప్లస్, మైనస్ రెండు ఉంటాయి. అయితే అవి ఎంత మోతాదులో పార్టీని ప్రభావితం చేస్తాయనేది కీలకం.

ADVERTISEMENT

పొత్తులో ముందుకెళ్లడం అంటే పార్టీని కొన్ని స్థానాలకే పరిమితం చేయడమే. దీని వలన పొత్తు వలన సాధించుకున్న స్థానాలలో పార్టీ ఎలా అయితే బలపడుతుందో అలాగే మిగిలిన ప్రాంతాలలో పార్టీ బలహీనమవుతుంది. తద్వారా పార్టీలో ఆశావహులు, అసంతృప్తులు సమపాళ్లలో ఉంటారు. ఇది పార్టీకి మైనస్ అనే చెప్పాలి. అయితే జనసేన యువత ప్రభావితం ఉన్న పార్టీగా గుర్తింపు సాధించింది కాబట్టి పార్టీ బలోపేతాన్ని ఇది ప్రభావితం చేయకపోవచ్చు.

ఒక్కసారి టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం వలన బీజేపీ గతం కంటే ఎక్కువ సంఖ్యలో సొంతగా ఓట్లను సాధించుకోగలిగింది అనేది పైన గణాంకాల ద్వారా రుజువయ్యింది. అలాగే 2023 వరకు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీ కూడా గతంలో ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకుని తన బలాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ చివరికి ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి చేరుకుంది.

అదేవిధంగా జనసేన కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ తన బలాన్ని పెంచుకోవాలి. జనసేన ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు పొత్తులో పోటీ చేయబోయే స్థానాలలో బలంగా పని చేస్తే ఇటు సొంత పార్టీ ఓటింగ్ కు తోడు టీడీపీ ఓటింగ్ కలవడంతో స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం వస్తుంది. ఆ పార్టీ తరుపున నాయకుడిగా స్థిరపడ్డ నేతలు పార్టీకి సొంత క్యాడర్ తీసుకురాగలుగుతారు.

తద్వారా వచ్చే ఎన్నికలలో ఈ 24 స్థానాలలో జనసేన తన సొంత బలాన్ని కూడగట్టుకోవచ్చు. గత ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించుకోలేక పోయిన జనసేన భేషజాలకు పోయి వచ్చిన ఈ 24 సీట్లలను కూడా జారవిడుచుకోవడం అవివేకమే అవుతుంది. అన్ని ఆలోచించే పవన్ ఈ నిర్ణయానికి వచ్చివుంటారు. వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు…బెయిలు మీద ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి నాయకత్వాన్ని బలపరుస్తున్న నేతలు ఎందరో ఉన్నారు.

ఎటువంటి అవినీతి మరక లేకుండా రాష్ట్రం కోసం ఈ ఒక్కసారికి నన్ను నమ్మి, నా నిర్ణయాల వెంట నాతో నడవండి అంటూ వేడుకుంటున్న పవన్ వెంట నడవడానికి జనసైనికులు ఎందుకు సందేహిస్తున్నారో…? ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది ముఖ్యం కాదు ఎన్ని సీట్లలో విజయం సాధించాం అన్నదే ఇక్కడ కీలకం అంటూ పవన్ చేస్తున్న ప్రకటనలు పట్టించుకోరా..?

పవన్ ను ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే వారి ఆశలకు ఇది తొలి మెట్టు కింద భావించి అడుగు ముందుకు వేయగలిగితే రానున్న కాలం జనసేనకు కలిసి రావచ్చుగా..? కేసీఆర్ ను గద్దె దింపే మొగాడే లేదు అంటూ విర్ర వీగిన బిఆర్ఎస్ నాయకుల అతి విశ్వాసాన్ని ఒకే ఒక్క ఎన్నికలతో కాలరాశారు రేవంత్. రాజకీయాలలో ఎప్పుడు ఏ అద్భుతమైన జరగవచ్చు. ‘టైం వచ్చే వరకు పోటీలో నిలబడి ఉంటే చాలు’ అని రేవంత్ నిరూపించారు.

అలాగే జనసైనికులు కూడా ”వచ్చిన సీట్ల గురించి కాకుండా వేయాల్సిన ఓట్ల గురించి” ఆలోచిస్తే ఇటువంటి చర్చలకు తావు ఉండదు. ఇవన్నీ పొత్తు వలన జనసేనకు జరిగే మంచిగానే భావించాలి. పవన్ చెప్తున్నట్టుగా జనసేన పోటీ చేస్తున్న 24 కి 24 స్థానాలలో జనసేనను గెలిపించి అసెంబ్లీకి పంపగలిగితే 2024 ఎన్నికల తరువాత టీడీపీ , జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో జనసేనకు సముచిత స్థానం కల్పించినట్టే.

పార్టీ అభివృద్ధి, వ్యక్తిగత లబ్ది పక్కన పెట్టి ఈ ఒక్కసారికి రాష్ట్ర అభివృద్ధి గురించి కలిసి అడుగేద్దాం…అంటున్న పవన్ వెంట అడుగు ముందుకు వేసే జనసైనికులు ఎవరనేది వారి విజ్ఞతకే వదిలేయడమే…! ఒకవేళ టీడీపీ తో పొత్తు కాదని ముందుకెళ్లినా జనసైనికులు ఆశించినట్టు పవన్ ముఖ్యమంత్రి కాలేరుగా. మళ్ళీ 2019 అవమానాలే ఎదురవుతాయి. ఈసారి ఎలా అయినా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలి అనుకుంటున్న పవన్ కల మళ్ళీ కలగానే మిగిలే ప్రమాదం లేకపోలేదు.

గతాన్ని అలోచించి…భవిష్యత్తు మీద ఆశతో ప్రస్తుతానికి కలిసి నడవాల్సిందే అనేది పవన్ అభిప్రాయంగా కనపడుతుంది. మరి ఆలోచించేది ఎవరో…? చరించేది ఎవరో…? కలిసి ముందడుగు వేసేదెవరో..? పవన్ నిర్ణయానికి కట్టుబడేదెవరో…? సీఎం…సీఎం…అంటూ నినదించడం కాదు అందుకు తగ్గ మార్గాలు ఏర్పరుచుకోగలగాలి.

ADVERTISEMENT
Latest Stories