మాంచి ఊపుతో ప్రారంభమైన విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ పనులు ఆశించిన విధంగా ముందుకు వెళ్లకపోవడంతో, ఇక ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనని భావించిన నేపధ్యంలో… ఇటీవల ఏపీ సర్కార్ 300 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి అవాక్కు చేసింది. దీంతో మళ్ళీ వెలుగులోకి వచ్చిన మెట్రో ప్రాజెక్ట్ పై తాజాగా కొన్ని కీలక ఒప్పందాలు, నిర్ణయాలు జరిగాయి. ఈ మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు, డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) మధ్య ఒప్పందం కుదిరింది.
‘అమరావతి’ మెట్రోగా నామకరణం అయిన ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న రెండు కారిడార్లను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గానూ ముందుగా జైకా నుంచి రుణం తీసుకోవాలని భావించగా, ప్రస్తుతం ఆ ప్రతిపాదనలను విరమించుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. జైకా విధిస్తున్న నిబంధనలతో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగేలా కనిపించడం లేదని మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 300 కోట్లతో పనులను ప్రారంభించనున్నామని, బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. డీల్ పై సంతకాల తరువాత ప్రసంగించిన రామకృష్ణారెడ్డి, ఈ 300 కోట్లతో భూసేకరణ పనులు ప్రారంభిస్తామని, ఆపై డీఎంఆర్సీ పని మొదలవుతుందని వివరించారు. త్వరలోనే మెట్రో ప్రాజెక్టుకు కొత్త టెండర్లను కూడా పిలవనున్నామని వెల్లడించారు.



