
కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన జగన్ కు, పాలన మొదలు పెట్టకుండానే నిర్మాణాలకు బీజం వేస్తున్న చంద్రబాబు కు మధ్య ఉన్న తేడా ఏమిటో ఈనాటి తరానికి చాటి చెపుతుంది ప్రస్తుత అమరావతి ప్రాంతం. 2019 లో అధికారాన్ని అందుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించిన నాటి నుంచి అధికారానికి దూరమైన నాటి వరకు విధ్వంసాన్నే నమ్ముకుంది.
2019 జూన్ 29 న ప్రజా వేదికతో మొదలుపెట్టిన వైసీపీ కూల్చివేతల పర్వం దినదినాభివృద్ధి చెందుతూ రాజధాని అమరావతిని సమాధి చేసే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి మాటెత్తకుండా నవరత్నాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూల్చారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక హిందూ దేవాలయాల మీద దాడులు, దేవతా విగ్రహాల కూల్చివేతలకు లోటు లేదు. చివరికి పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను సైతం వదిలి పెట్టలేదు వైసీపీ సర్కార్.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
రాజకీయాలలోకి వ్యక్తిగత జీవితాన్ని తీసుకు వచ్చి అటు రాజకీయ విలువలను కూల్చేశారు జగన్. అలాగే గౌరవ సభగా ఉండాల్సిన శాసన సభను కౌరవ సభగా మార్చి అసెంబ్లీ గౌరవాన్ని కూల్చేశారు జగన్. రాజకీయాలలోకి బూతుల సంస్కృతిని పరిచయం చేసి రాజకీయ విమర్శల విలువను కూల్చేశారు. ఎన్నికలలో హింసను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూల్చారు జగన్.
ఇలా నిర్మాణాలే కాదు 151 సీట్లతో వైసీపీ పార్టీ మీద ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన అతి కొద్దీ కాలంలోనే కూల్చుకున్నారు. రాజధాని ప్రాంతాన్ని స్మశానం అంటూ, అమరావతి ఒక ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు అనుకూలంగా లేని ప్రాంతమంటూ ప్రచారం చేసి 33 వేల ఎకరాల ప్రాంతాన్ని ఒక పాడుపడ్డ ముళ్ల ప్రాంతంగా మిగిల్చి రైతుల త్యాగాన్ని కూల్చేశారు జగన్.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వదిలినాడు అమరావతి ఎలా ఉండేదో ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవి నుండి వదిలి వెళ్లేటప్పుడు ఎలా ఉందో చూస్తే ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం ఇట్టే అర్ధమవుతుంది. అయితే 2019 జూన్ లో ఆగిన అమరావతి పనులు మళ్ళీ సరిగ్గా ఐదేళ్ల తరువాత 2024 జూన్ లో మొదలయాయ్యి. జూన్ 4 ఎన్నికల ఫలితాలతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి పట్టిన ఐదేళ్ల వైసీపీ గ్రహణం వీడినట్టు ఒక్కసారిగా కాంతులు విరజిల్లుతున్నాయి.
ఇన్నాళ్ళుగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన అమరావతి ప్రాంతంలో పనులు శరవేగంతో సాగుతున్నాయి. ఇంకా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరానేలేదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనే లేదు అయినప్పటికీ అధికారులే చొరవ తీసుకుని అమరావతిలో పేరుకుపోయిన చెత్తను సుమారు 100 జేసీబీలతో తొలగిస్తున్నారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీద యల్ఈడి లైట్లు మెరుస్తున్నాయి.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
దీనితో అటు అమరావతి రైతుల జీవితాలతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా వెలిగిపోవడం ఖాయంగా కనపడుతుంది. గత ఐదేళ్ల జగన్ పాలనను ఒక కేసు స్టడీ గా తీసుకొని ముందుకెళ్లాలంటూ బాబు కూటమి నేతలకు హితబోధ చేసారు. దీనితో ఈసారి అమరావతిలో జరిగే నిర్మాణాలను కానీ, రాజధానిని కానీ ఎవ్వరు మార్చే అవకాశం లేకుండా, కదిలించే చట్టాలు రాకుండా ఏపీ రాజధాని అమరావతే అంటూ బాబు తన మార్క్ పాలనతో ఒక శాసనం చేసే అవకాశం లేకపోలేదు.