అయ్యా అంబటి… ఇది మీ సబ్జెక్ట్ కాదా?

Ambati Rambabuచంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను విమర్శించడం, ఎద్దేవా చేయడంలో మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ ముందుంటారు. సంక్రాంతి పండుగ వస్తే సత్తెనపల్లిలో లాట్రీలు నిర్వహిస్తుంటారు. బ్యాండ్ మేళం, సినిమా పాటలు పెట్టుకొని రోడ్లపై డాన్సులు చేసి ప్రజలను అలరిస్తుంటారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ విషయంలో బ్రిజేష్ కుమార్‌ ట్రిబ్యూనల్‌కు సర్వాధికారాలు కట్టబెడుతూ గెజెట్ నోటిఫికేషన్‌ జారీ చేయబోతోందనే విషయం సాగునీటిశాఖ మంత్రిగా చేస్తున్న అంబటి రాంబాబుకి ముందే తెలుసుకోలేకపోయారు!ఎందుకంటే ఇది ‘తన సబ్జెక్ట్’ కాదనుకొన్నారో లేక ప్రతిపక్ష నేతలను అవహేళన చేయడం కోసం మీడియా సమావేశాలతో బిజీగా ఉన్నారో?

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసేసిన తర్వాత పత్రికలలో వార్తలు చూసిన తర్వాత హడావుడిగా మీడియా ముందుకు వచ్చి “కృష్ణా జలాలలో ఒక్క చుక్క నీటి బొట్టు కూడా వదులుకోము. ఈ విషయం గురించి మాకు అవగాహన లేదని, దీని కోసం మేము ఎటువంటి కృషి చేయలేదనే వాదనలు సరికాదు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి దీనిపై అభ్యంతరం తెలుపుతూ లేఖ వ్రాశారు. మేము సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాము,” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ఆయన తన మంత్రిత్వ శాఖపై దృష్టి పెట్టి ఉండి ఉంటే ఈవిదంగా జరగక మునుపే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపి గెజెట్ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా అడ్డుకోనేవారు. కానీ వైసీపి ప్రభుత్వం దృష్టి ఎంతసేపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఏవిదంగా లోపల వేయాలి? సంక్షేమ పధకాలకు కొత్తగా ఎక్కడ నుంచి అప్పులు తేవాలనే వాటిపైనే ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంపై శ్రద్ద లేదని ఇది నిరూపిస్తోంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని తెలుస్తూనే ఉండి. దీని వలన కృష్ణా జలాలపైనే ఆధారపడున్న రాయలసీమ జిల్లాలకు తీరని నష్టం కలుగుతుంది. ఇంత ముఖ్యమైన విషయం వైసీపి ప్రభుత్వానికి తెలియకనే అలసత్వం ప్రదర్శించిందనుకోవాలా లేదా తమ కేసులు, అప్పుల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందనుకోవాలా?

ఇంకా షాకింగ్ ఏమిటంటే, జగన్మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ నోటిఫికేషన్‌ వెలువడింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసిన తర్వాత దానిపై అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం సిగ్గుచేటు కాదా?

ADVERTISEMENT
Latest Stories