అమిత్‌ షా చెప్పేదొకటి… సోమూ చెప్పేది మరోటి!

Somu Verrajuఇటీవల విశాఖలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏపీలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి వైసీపీ నేతలు ఏదో సర్ధిచెప్పుకొన్నారు. అయితే దీనిపై టిడిపి, బిజెపిల మద్య యుద్ధం కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

“జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని స్వయంగా అమిత్‌ షాయే చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఇంకా పలువురు టిడిపి నేతలు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

టిడిపి విమర్శలకు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. “రాష్ట్రాలలో శాంతి భద్రతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే తప్ప కేంద్రానిది కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 500 మంది బిజెపి కార్యకర్తలను మమతా బెనర్జీ ప్రభుత్వం చంపించేసింది. కేరళలో కమ్యూనిస్టులు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపేస్తూనే ఉన్నారు.

అయినా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే మేము ఆ పార్టీలను ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కోవాలనుకొన్నాము కనుక. ఏపీ విషయంలో కూడా మా విధానం అదే. కనుక పదేపదే టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదు,” అంటూ ఆయన చంద్రబాబు నాయుడుపై ఇంకా చాలా విమర్శలు చేశారు.

ఏ రాష్ట్రంలోను అరాచకాలను సహించేది లేదని అమిత్‌ షా చాలా స్పష్టంగా చెపితే, పశ్చిమ బెంగాల్, కేరళలో బిజెపి కార్యకర్తలని అక్కడి అధికార పార్టీలు హత్యలు చేస్తున్నా తాము సహిస్తున్నామని, కనుక ఏపీలో టిడిపి కార్యకర్తలని వైసీపీ హత్యలు చేయించినా సర్దుకుపోవాలని సోమూ వీర్రాజు చెపుతున్నట్లుంది.

ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, “మేము అరాచకాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతుంటే మద్యలో సోమూ వీర్రాజుకి ఎందుకు కోపం వస్తోంది? వివేకా హత్య కేసుని దర్యాప్తు చేయడానికి వచ్చిన సీబీఐ అధికారుల మీద వైసీపీ గూండాలు దాడి చేస్తే మీరెందుకు స్పందించలేదు? ఏపీలో దళితులు, బీసీల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే మీరెండుకు స్పందించడం లేదు? మీరు స్పందించనప్పుడు మేము ప్రశ్నిస్తే తప్పా? అయినా మీ అధిష్టానం జగన్ ప్రభుత్వం తప్పు చేస్తోందని చెపుతున్నప్పుడు, మీరెందుకు దానిని వెనకేసుకువస్తున్నారు?” అని ప్రశ్నించారు.

వైసీపీతో తమకు ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించేందుకు అమిత్‌ షా, జేపీ నడ్డాలు ప్రయత్నిస్తుంటే, సోమూ వీర్రాజు వైసీపీని వెనకేసుకువస్తున్నట్లు మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories