ఏడు పదులు దాటిన వయసులోనూ ఉత్సాహంగా, కుర్రకారుతో పోటీపడి సినీ ప్రియులను అలరిస్తున్న ‘సూపర్ స్టార్’ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు నెట్టింట సెన్సేషన్ గా మారింది. తన స్వదస్తూరితో, తన మరణానంతరం ఆస్తుల పంపకం వివరాలు రాసిన ప్లకార్డును అమితాబ్ ప్రదర్శించారు. “నేను మరణిస్తే, నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే” అని ఆ ప్లకార్డులో ప్రకటించారు.
అయితే ఉన్నట్లుండి బిగ్ బీ ఇలా ప్రకటించడం వెనుక… దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా తెలియజేసారా? లేక బిగ్ బీ ఆరోగ్యం క్షీణించిందా? అని అభిమానులు కలవరపడుతున్నారు. బిగ్ బీ నటించిన ‘సర్కార్ 3’ ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో… ఇటీవల విడుదలైన ట్రైలర్ మరోసారి అమితాబ్ స్థాయిని చాటిచెప్పింది. అమితాబ్ ఎందుకు పోస్ట్ చేసినా… ఆ వ్యాఖ్యల అంతరార్ధం మాత్రం అందరూ అర్ధం చేసుకోవాలి అంటున్నారు అభిమానులు.



