కొత్త సంవత్సరం వేడుకల సమయంలో తాగి కారు నడిపిన టీవీ యాంకర్ ప్రదీప్ అప్పటినుండి మాయం అయిపోయారు. అప్పటికప్పుడు ప్రదీప్ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు. బేగంపేట ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పి వదిలేశారు. అయితే నిన్నటి వరకు ఆయన హాజరు కాకపోవడం, ఫోన్లు ఎత్తకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అని పుకార్లు షికారు చేసాయి.
వాటన్నింటికి ఆయన ఓ వీడియో ద్వారా సమాధానం చెప్పారు. ముందుగా ఒప్పుకున్న షూటింగ్స్ ఉండటం వల్లనే పోలీసుల వద్దకు రాలేకపోయానని అన్నారు. అంతేకాక ఫోన్లు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉండటంతో కొన్ని ముఖ్యమైన కాల్స్‌కు కూడా స్పందించలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులు కూడా ఆయన కాల్ షీట్లు తీసుకోవాలేమో మరి.
చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటన్నిటినీ స్వీకరిస్తానని ఆయన అన్నారు. అంతే కాక డ్రంకన్ డ్రైవ్ మీద గతంలో ఓ వీడియో చేశానని దానిని ఉల్లంఘించినందుకు క్షమించండి అని అడిగి అదేవిధంగా నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని అన్నారు. ప్రదీప్ కు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.



