ఎన్నికలలో గెలుపు కోసం హామీలు… ఆ హామీల అమలు కోసం అప్పులు… ఆ అప్పులు చెల్లింపు కోసం ప్రజలకు వడ్డింపులు… అవి భరించలేక ప్రభుత్వాలు మార్పు …. ఇదో పద్మవ్యూహంలా నిరంతరంగా సాగిపోతూనే ఉంది. కానీ దీనిని ఎవరూ చేదించే ప్రయత్నం చేయకపోగా ఈ పద్మవ్యూహాన్ని ఇంకా ఇంకా విస్తరించుకుంటూ పోతున్నారు.
అధికారం చేజిక్కించుకోవడం కోసం, అధికారంలోకి వచ్చాక హామీల అమలు కోసం, అవి చేసే తప్పుడు నిర్ణయాలు, విధానాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాలు వేలు, లక్షల కోట్లు అప్పులు చేసేస్తున్నాయి.
రాజకీయ పార్టీలు సృష్టించిన ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని ధరలు, ఛార్జీలు, పన్నుల పెంపుతో సామాన్య ప్రజలు అల్లాడుతుంటే, అధికారం చేజిక్కించుకున్న పార్టీలు, వాటి నేతలు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మరో ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగనంత పోగేసుకుంటున్నారు.
ఓ పక్క విచ్చలవిడిగా అప్పులు, ఖర్చులు చేస్తూనే, గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిందని ఆరోపిస్తున్నారు. అందువల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఉద్యోగులకు జీతాలు పెంచలేకపోతున్నామని, అందువల్లే అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, అందువల్లే ఛార్జీలు పెంచాల్సివస్తోందని మళ్ళీ నిసిగ్గుగా సమర్ధించుకుంటున్నాయి. శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నాయి.
ప్రభుత్వాలు ఇలా అందినకాడికి వేలు, లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే, ఆదాయం-ఖర్చులు-అవసరాలు-కోరికల మద్య పొంతన కుదరకపోవడంతో ప్రజలు సైతం ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు.
కేంద్ర గణాంకాల శాఖా విడుదల చేసిన 2020-21 నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రాలో అత్యధికంగా 43.7 శాతం మంది, తెలంగాణలో 37.2%, కేరళలో 29.9%, తమిళనాడులో 29.4%, కర్ణాటకలో 23.2% మంది ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నత విద్యావంతులు, చక్కని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రజలలో ఆర్ధిక క్రమశిక్షణ ఎక్కువని మంచి పేరుంది. కానీ రాజకీయ పార్టీల దురాశ వల్ల కావచ్చు లేదా ప్రభుత్వాల నిర్వాకం వల్ల కావచ్చు దక్షిణాది ప్రజలు కూడా క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు. ఆ కారణంగానే కాల్ మనీ వంటి సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి అవి కూడా ప్రజలను పీల్చి పిప్పి చేసేస్తున్నాయి.
ఇటువంటప్పుడు అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వాలు, సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెడుతూ వారిని పని సంస్కృతికి దూరం చేసి బద్దకస్తులుగా మార్చేస్తున్నాయి. కనుక మున్ముందు రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉంది.




