2023 ఏపీ రౌండప్… ఎక్కడి గొంగళి అక్కడే లేదు!

YS-Jagan Mohan Reddy Andhra Pradesh Chief Minister

మరో రెండు రోజుల్లో 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. కనుక ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏమి సాధించింది అని ఓసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్టు, విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతలు చేసిన హడావుడి తప్ప అభివృద్ధి కనబడదు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ కావడం, వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ, కోర్టుల చుట్టూ తిరుగుతుండటం, వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం, ఈ కేసులకి సంబందించిన వార్తలు, విశ్లేషణలతో వైసీపికి పెద్ద పెద్ద మరకలే అంటుకొన్నాయి.

ADVERTISEMENT

2023, మార్చిలో విశాఖలో రెండు రోజులపాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వస్టర్స్ సమ్మిట్ జరిగింది. దానిలో రాష్ట్రానికి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటితో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వైసీపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది.

కానీ ఇంతవరకు వాటిలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. అంటే ఆ సదస్సు, హడావుడి, దాని కోసం చేసిన కోట్ల రూపాయల ఖర్చు అంతా వృద్ధాయే… ప్రజలను మభ్యపెట్టడానికే అని అనుమానించక తప్పడం లేదు.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత అకస్మాత్తుగా చాలా బలపడినపడిన్నట్లు కనిపించినప్పటికీ కొన్ని నెలలకే అంతా తారు మారైపోయింది.

ఆ ఆలోచన బెడిసికొట్టగా, తాజాగా ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలని మార్చేసుకొంటూ వైసీపి అభద్రతాభావాన్ని చాటింపు వేసుకోవడమే కాక, ఎన్నికలకు ముందే ఓటమికి సిద్దమైపోయిన్నట్లు చాటుకొన్నట్లయింది.

సిఎం జగన్‌ విశాఖకు మకాం మార్చేందుకు స్వయంగా అనేక ముహూర్తాలు పెట్టుకొన్నప్పటికీ ఇంతవరకు రాలేకపోవడంతో వైసీపి ప్రభుత్వం నవ్వులపాలవుతోంది.

ఋషికొండపై వందల కోట్లు ఖర్చు చేసిన విలాసవంతమైన భవనం కొట్టవచ్చిన్నట్లు కనబడుతోంది కానీ దానిని సిఎం కార్యాలయమని ధైర్యంగా చెప్పుకోలేని దయనీయస్థితి నెలకొంది. కనుక 2023 వైసీపికి అంత గొప్పగా ఏమీ లేదనే చేపోచ్చు.

2023 టిడిపికి కాస్త మేలు, కాస్త కీడు చేసిందనే చెప్పవచ్చు. యువగళం పాదయాత్రతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన నాయకత్వ లక్షణాలు చాటుకోగా, జగన్‌ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు పేరుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బందించడం టిడిపి నిసహాయతని చాటిచెప్పింది.

అయితే ఈ అరెస్ట్ కారణంగానే టిడిపి తన వాస్తవ బలాన్ని గుర్తించగలిగింది. ఈ అరెస్ట్ కారణంగానే రాష్ట్ర ప్రజలలో టిడిపి పట్ల సానుభూతి పెరిగింది. ఈ ఏడాదిలోనే టిడిపి, జనసేనల పొత్తు కుదుర్చుకొని నిలకడగా ముందుకు సాగుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ చేసిన వారాహి యాత్రలతో 2023లో జనసేన పార్టీకి మంచి గుర్తింపే లభించింది. రాష్ట్రంలో బలపడింది కూడా. బీజేపీతో జనసేన పొత్తులో ఉండగానే టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ తీసుకొన్న కీలక నిర్ణయం కూడా ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను, పార్టీల బలాబలాలను చాలా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి కనీసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కూడా లేకపోగా ఇంకా దిగజారిపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ఆస్తులు, కొండలు, గుట్టలు వేగంగా కరిగిపోతుండగా, అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తాజాగా పారిశుధ్య కార్మికులు జీతాల కోసం ఆందోళనలు చేస్తుంటే, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు రూ.1,000 కోట్ల కోసం సదరు ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి. కనుక 2022 కంటే 2023 ఏపీకి ఇంకా ఎక్కువ నష్టాన్ని, చేదు అనుభవాలనే మిగిల్చిందని చెప్పక తప్పదు. వైసీపి పాలనలో ఇదే పరాకాష్ట అనుకొన్నా 2023తో ఇవన్నీ ముగిసిపోతే పర్వాలేదు కానీ….

ADVERTISEMENT
Latest Stories