ఓటీఎస్ పేరుతో ఇప్పటికే పేద ప్రజల మీద ఎంతో భారాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపధ్యంలో… తాజాగా మరో కొత్త ఆలోచనకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టినట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ప్రచురించింది.
ఒకప్పుడు పంట పొలాలుగా ఉన్న భూములన్నీ కాలానుగుణంగా ప్లాట్స్ మరియు అపార్టుమెంట్ రూపాలలోకి మారిపోయాయి. అయితే నిబంధనల ప్రకారం పొలాలుగా ఉన్న భూములు ఇలా కమర్షియల్ రూపంలోకి మారాలంటే ‘ల్యాండ్ కన్వర్షన్’ ఖచ్చితంగా చేసి ఉండాలి.
ఒకప్పుడు ఈ నిబంధనను భూ విక్రయదారులు పాటించేవారు కాదు, అలాగే ప్రజలకు కూడా అవగాహన లేదు. దీంతో ‘ల్యాండ్ కన్వర్షన్’ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక లే అవుట్లు వెలిసాయి. వీటిలో ఎక్కువ శాతం మధ్య తరగతి ప్రజలే కొనుగోలు చేసారు.
‘ల్యాండ్ కన్వర్షన్’కు కట్టాల్సిన ‘నాలా’ ఫీజును చెల్లించకుండా వెలసిన లే అవుట్లు గానీ, అపార్టుమెంట్ లు గానీ ఇపుడు తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ప్రభుత్వం చర్యలను సిద్ధం చేస్తోంది. నిజానికి భూ విక్రయదారుడే సదరు ‘నాలా’ ఫీజును ప్రభుత్వానికి చెల్లించి ప్లాట్స్ ను గానీ, అపార్ట్మెంట్స్ ను గానీ విక్రయదారులకు అమ్మాలి.
కానీ నేడు పరిస్థితి ఏమిటంటే, భూ విక్రయదారుడి నుండి కొనుగోలు చేసిన వారిపై ఈ ‘నాలా’ ఫీజు మరియు ఇప్పటివరకు కట్టనందుకు జరిమానా పడుతోంది. ఎన్నో సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన మొత్తానికి ఫీజు + పెనాల్టీ రూపంలో నేడు ప్రజలు భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఒకవేళ నాలా ఫీజు చెల్లించని పక్షంలో ప్రస్తుతం జరిగే లే అవుట్లకు గానీ, అపార్ట్మెంట్ లకు గానీ రిజిస్ట్రేషన్స్ నిలిపివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లుగా ఈ కధనం సారాంశం. జనవరి నెలాఖరు నాటికి బకాయిదారులందరికీ డిమాండ్ నోటీసులు వెళ్లే విధంగా జగన్ సర్కార్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిందట.
గతంలో ఉన్న బకాయిల రూపేణా గానీ, ప్రస్తుత లే అవుట్లకు వసూలు చేసే రూపేణా గానీ… మొత్తమ్మీద 2000 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుని జగన్ సర్కార్ బరిలోకి దిగుతున్నట్లుగా ప్రచురితం అయిన ఏబీఎన్ కధనం సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతోంది. మరి దీనికి మిడిల్ క్లాస్ ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో?
ఎందుకంటే ఓటీఎస్ పధకానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు, పెద్ద ఎత్తున నిరుపేదలు జగన్ సర్కార్ పై తీవ్రంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోన్న వీడియోల ద్వారా స్పష్టమైంది. మరి ఈ ‘నాలా’ ఫీజుకు స్కీంకు మధ్య తరగతి ప్రజల ముఖచిత్రాలు ఎలా మారిపోతాయో?!



