నేటితో పూర్తయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశంలోని ప్రసిద్ధ సర్వే సంస్థలు తన అంచనాలు విడుదల చేశాయి. మొత్తంగా సర్వేలు చూస్తుంటే మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ మరో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. గత 48 ఏళ్లలో సొంతంగా రెండు సార్లు వరుసగా అధికారికంగా వచ్చిన ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. చంద్రబాబు ఆశపడినట్టు యూపీఏగానీ కేసీఆర్ ఆశపడినట్టు ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంగానీ ఏర్పడే అవకాశమే లేదని సర్వేలు తేల్చేశాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరు మరో సారి కనిపించింది. ఒకటి రెండు సంస్థలు కాంగ్రెస్ కు బీజేపీకు ఒక్కటి అర సీట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు సారు వెనకే ఉన్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో మరోసారి సందిగ్దత కనిపించింది. గత ఎన్నికలు లాగానే టీడీపీ అని కొందరు, వైఎస్సార్ కాంగ్రెస్ అని కొందరు చెప్పుకొచ్చారు. ఎక్కువగా సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపడం విశేషం. లగడపాటి, టుడేస్ చాణక్య వంటి ట్రాక్ రికార్డు కలిగిన సంస్థలు టీడీపీ వైపు నిలిచాయి.
అన్ని సర్వేలు జనసేన పార్టీ అత్యంత పేలవమైన ప్రదర్శన ఇవ్వబోతుంది అని చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లూ గెలుస్తారు అని కూడా ఏ సంస్థా చెప్పకపోవడం గమనార్హం. దీనితో జనసైనికులు ఢీలా పడిపోయారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రావడమంటే రెండు తెలుగు ప్రభుత్వాలకు వచ్చే ఐదు సంవత్సరాలు కేంద్రంలో ఎటువంటి పనులు అవ్వవని కూడా చెప్పవచ్చు. పై పెచ్చు బీజేపీని ఇక్కడ వ్యాపించడం కోసం రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలను ఇబ్బంది పెట్టడం కూడా ఖాయం.



