అవును.. జగన్ ప్రభుత్వం అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకి తరలించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. ఈవిషయం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా ఈరోజు లోక్‌సభలో చెప్పారు.
హైకోర్టు తరలింపు గురించి వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకి తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది. అయితే హైకోర్టు తరలింపుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టుతోనే చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించాము. హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కనుక ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ హైకోర్టు అంగీకరించినట్లయితే, అప్పుడు ఇరుపక్షాలు తమ ఆమోదం తెలుపుతూ హైకోర్టు తరలింపుకి ప్రతిపాదన పంపినట్లయితే పరిశీలిస్తామని చెప్పాము,” అని కిరణ్ రిజిజు తెలిపారు.
ఏపీ హైకోర్టు ఆదేశం ప్రకారం అమరావతినే రాజధానిగా పరిగణించి నిర్మాణ పనులు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు చెపుతోంది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వద్ద నిధులు లేనందున అమరావతి పరిధిలో భూములు వేలంపాటకు సిద్దమైంది. కానీ రాజధాని పేరు చెప్పి అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను అమ్మేసుకొంటూ, మరోపక్క గుట్టుగా కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నేడు బయటపడింది. అంటే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని అర్దమవుతోంది. కనుక అమరావతిలో భూములు అమ్మగా వచ్చే డబ్బును వేరే వాటికి మళ్ళించబోతున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతిలో నిర్మాణపనులు చేస్తామని హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు అర్దమవుతోంది.



